దేశంలో భారీ నేపథ్యమున్న చిత్రాలు, అతి పెద్ద కథాంశాలను సినిమాగా తెరకెక్కించాలంటే కనిపిస్తున్న అతికొద్దిమంది రచయితల్లో విజయేంద్ర ప్రసాద్ ఒకరు. ‘బాహుబలి’, ‘బజరంగీ భాయిజాన్’, ‘మణికర్ణిక’, ‘ఆర్‌ఆర్ఆర్’ అంటూ తనదైన శైలిలో భారీ చిత్రాలకు కథలు అందించి మెప్పించారు విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఆయన చేతిలో ‘సీత’, మహేష్ సినిమా లాంటి పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో కథ కూడా చేరింది అంటున్నారు. ఇది కూడా ఎపిక్ స్టోరీ అని చెబుతున్నారు.
బాలీవుడ్ నుండి విజయేంద్ర ప్రసాద్‌కు ఇటీవల ఓ భారీ చిత్రం ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. తెలుగు దర్శకుడితోనే ఈ సినిమాను తెరకెక్కిస్తారని కూడా చెబుతున్నారు. అయితే అతను ఎవరు అనేది తెలియదు కానీ… కథాంశం విషయంలో మాత్రం కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ‘1770 – ఏక్ సంగ్రామ్’ అనే పేరుతో ఈ సినిమా రూపొందించనున్నారని తెలుస్తోంది. బెంగాలీలో వచ్చిన ‘ఆనంద మఠం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నారట.
ఆంగ్లేయుల పాలనలో 1770లో జరిగిన ఒక సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంలో ఈ నవలను రాశారు. ప్రఖ్యాత బెంగాలీ రచయిత బంకించంద్ర చటర్జీ ఈ నవలను రాశారు. 1771వ సంవత్సరంలో బెంగాల్‌లో సంభవించిన మహా కరువు, సన్యాసుల తిరుగుబాటు లాంటి అంశాలను ఈ నవలలో ప్రస్తావించారట. ఈ నవల బెంగాలీ నుండి హిందీ సహా వివిధ భాషల్లోకి అనువాదమైంది. ఇప్పుడు ఈ నవలకు సినిమా కథ రూపాన్ని అందించాలంటూ విజయేంద్ర ప్రసాద్ దగ్గరకు వచ్చారట.
దేశంలో ఇలాంటి కథలకు ఇప్పుడు కనిపిస్తున్న కథారచయిత విజయేంద్ర ప్రసాదే అనడంలో మరో మాట అక్కర్లేదు. ఈ సినిమాకు సంబంధించి ఆగస్టు 15న అధికారిక ప్రకటన వస్తుందట. అప్పుడు ఇందులో నటించేదెవరు, సాంకేతిక నిపుణులు ఎవరు అనే విషయంలో క్లారిటీ వస్తుందట. అన్నట్లు ఆ నవలలో ఉపయోగించిన ‘వందేమాతరం’ గీతాన్నే 1896 కాంగ్రెస్ మహాసభల సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారట. ఆ తర్వాతే వందేమాతర గీతం ప్రసిద్ధికెక్కిందని చెబుతారు.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?