కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే చాలా అడ్డంకులను ఎదుర్కొంటుంది. ఇటీవలే ఈ సినిమాను కువైట్ లో నిషేధించారు. టెర్రరిస్ట్ ల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించడంలో కువైట్ ప్రభుత్వం విడుదలకు నిరాకరించింది.
దీంతో ‘బీస్ట్’ సినిమాను కువైట్ లో తప్పించి మిగిలిన దేశాల్లో విడుదల చేయబోతున్నారు. అయితే ఇప్పుడు విజయ్ సొంత రాష్ట్రంలోనే ఈ సినిమాపై వ్యతిరేకత ఏర్పడింది. ఈ సినిమాలో ఇస్లాంవాదులను తీవ్రవాదులుగా చిత్రీకరించారంటూ తమిళనాడు ముస్లిం లీగ్ అధ్యక్షుడు ముస్తఫా ‘బీస్ట్’ను తమిళనాడులో సైతం నిషేధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ముస్తఫా తమిళనాడు రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్లు సమాచారం.
ఇలా విజయ్ సొంత రాష్ట్రమైన తమిళనాడులోనే ‘బీస్ట్’ సినిమాపై నిరసనలు వెల్లువెత్తుతుండటంతో ఏప్రిల్ 13న ఈ సినిమా విడుదలపై అంతటా ఆసక్తి నెలకొంది. ఇదివరకు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’, విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్ఐఆర్’ సినిమాలు కూడా ఇలానే సమస్యలనే ఎదుర్కొన్నాయి. కువైట్ లో ఈ సినిమాలను నిషేధించారు. ఆ సినిమాల్లో తీవ్రవాదులు కువైట్ లు తలదాచుకున్నట్లుగా చూపించడంతో ఆ దేశం సదరు సినిమాలను బ్యాన్ చేసింది.
అరబ్ దేశాలు కూడా ముస్లిం వ్యతిరేక సినిమాలపై బ్యాన్ విధిస్తే కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. మరి ఈ అడ్డంకులను దాటుకొని విజయ్ సినిమా విడుదలవుతుందో లేదో చూడాలి!