రీసెంట్ గా విజయ్ నటించిన ‘వరిసు'(తెలుగులో వారసుడు) సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ట్రోల్స్ మొదలైపోయాయి. చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలకు థియేటర్లు తగ్గించి.. దిల్ రాజు ‘వారసుడు’ సినిమాకి ఎక్కువ థియేటర్లు కేటాయించుకున్నారు. మంచి స్క్రీన్స్ అన్నీ కూడా విజయ్ సినిమాకే ఇచ్చారు. ఈ విషయంలో మెగా, నందమూరి ఫ్యాన్స్ దిల్ రాజుపై గుర్రుగా ఉన్నారు. పైగా ఈ మధ్య పలు ఇంటర్వ్యూలలో దిల్ రాజు చేసిన కామెంట్స్ వలన కూడా అతడిపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది.
దీంతో అందరూ కలిసి దిల్ రాజు సినిమాను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ‘వారసుడు’ ట్రైలర్ చూస్తుంటే చాలా సినిమాలు గుర్తొస్తున్నాయి. ‘అత్తారింటికి దారేది’, ‘మహర్షి’, ‘బ్రహ్మోత్సవం’ ఛాయలు కనిపించడంతో మీమ్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. ఓ పక్కన చిరంజీవి, బాలయ్య సినిమాలతో పోటీ.. పోనీ ట్రైలర్ అయినా ఇంప్రెసివ్ గా ఉందా..? అనే అదీ లేదు. పైగా జనాల్లో ఇంత వ్యతిరేకత.. ఇవన్నీ చూస్తుంటే ‘వారసుడు’ తెలుగులో క్లిక్ అవ్వడం కష్టమనే అనిపిస్తుంది.
కానీ తమిళంలో మాత్రం సినిమా వర్కవుట్ అయ్యేలానే కనిపిస్తుంది. తెలుగులో విజయ్ కి పెద్దగా ఫాలోయింగ్ లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం అతడు స్టార్ హీరో. మనకి ఇలాంటి కథలు కొత్తవిగా అనిపించకపోవచ్చు కానీ కోలీవుడ్ జనాలకు నచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అక్కడ వచ్చింది తక్కువే. ట్రైలర్ లో విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటే మాస్ డైలాగ్స్, డాన్స్ లు, ఫైట్స్ ఉన్నాయి.
కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి. కాబట్టి విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాక ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ ఈ సినిమాను ఆదరించే ఛాన్స్ ఉంది. సినిమా బాలేదనే టాక్ వస్తే తప్ప.. తమిళంలో హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.