సీనియర్ నటులు కోటా శ్రీనివాసరావు ఈరోజు కన్నుమూశారు. ఇది యావత్ సినీ పరిశ్రమని షాక్ కు గురిచేసింది. కొన్నాళ్ళుగా కోటా శ్రీనివాస రావు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ మధ్యనే ఆయన కాలికి సర్జరీ కూడా జరిగింది. ఆ ఫోటోని నిర్మాత బండ్ల గణేష్ షేర్ చేయడం జరిగింది. బాత్రూం లో జారి పడటం వల్ల ఆయన కాలికి కూడా గాయమై మంచానికి పరిమితమయ్యారు అని తర్వాత అతని సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఇక పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. కోటా శ్రీనివాసరావు గారి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) కోటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ లోని, కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన వ్యక్తి. 1942, జూలై 10న జన్మించారు. కోటా శ్రీనివాసరావు ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. ఆయన తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో వైద్యుడు.
2) సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసేవారు కోటా. మరోవైపు ఎన్నో నాటకాల్లో కూడా నటించారు. ఆ వ్యామోహంతో సినిమాల్లోకి రావాలని ఆశపడ్డారు.
3) 1978-79లో వచ్చిన ‘ప్రాణం ఖరీదు’ అనే సినిమాతో కోటా శ్రీనివాసరావు సినీ రంగప్రవేశం చేశారు. వాస్తవానికి ‘ప్రాణం ఖరీదు’ అనేది నాటకం. దానిని చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ సినిమాగా తీశారు. ఆ నాటకంలో నటించిన వారినే సినిమాల్లోకి తీసుకున్నారు. అలా కోట శ్రీనివాస రావు సినీరంగ ప్రవేశం జరిగింది.మెగాస్టార్ చిరంజీవి కూడా ‘ప్రాణం ఖరీదు’ తోనే సినీ కెరీర్ ను ప్రారంభించారు.
4) కోటా శ్రీనివాసరావుకి నటుడిగా బ్రేక్ ఇచ్చిన సినిమా ‘అహ నా పెళ్ళంట’. ఇందులో పిసినారి లక్ష్మీపతి అనే పాత్రలో కోటా శ్రీనివాసరావు నటన అద్భుతం. కోటాని తప్ప ఈ పాత్రలో ఎవ్వరినీ ఊహించుకోలేం. అంత గొప్పగా నటించారు.
5) ఆ తర్వాత కోటా శ్రీనివాసరావు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాల్లో ప్రతినాయకుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి పాత్రలతో ఫుల్ బిజీ అయిపోయారు.
6) 1987 లో కోటా శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో ‘మండలాధీశుడు’ అనే సినిమా వచ్చింది. ఇందులో భీమారావు అనే పాత్రలో కూడా అద్భుతంగా నటించారు. కానీ ఇది అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ స్టార్ హీరోపై తీసిన సెటైరికల్ మూవీ. దీంతో ఆ స్టార్ హీరో అభిమానులు కోటా శ్రీనివాసరావుపై తీవ్రంగా దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ స్టార్ హీరోకి కోటా క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
7) 1996 రుక్మిణి గారితో అతనికి వివాహం అయ్యింది. ఈ దంపతులకి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం.
8) కొడుకు కోటా ప్రసాద్ ‘సిద్ధం’ సినిమాలో నటించారు. జెడి చక్రవర్తి ఆ సినిమాకు దర్శకత్వం వహించగా జగపతి బాబు హీరోగా నటించారు. ఆ తర్వాత వచ్చిన ‘గాయం 2’ లో కోటా శ్రీనివాసరావు తన కొడుకు కోటా ప్రసాద్ తో కలిసి నటించారు.
9) 2010 జూన్ లో కోటా శ్రీనివాస రావు తనయుడు కోటా ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కోటా మానసికంగా కుంగిపోయారు. కొడుకుపై బెంగతో ఆయన ఆరోగ్యం పాడైంది. అటు తర్వాత కోటా శ్రీనివాసరావు కి సినిమాల్లో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో ఆయన ఫ్రస్ట్రేషన్ ను పలు సినీ వేడుకల్లో చూపించడం జరిగింది.
10) ‘అహ నా పెళ్ళంట’ తో పాటు ‘హలో బ్రదర్’ ‘గాయం’ ‘గణేష్’ ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాల్లో కోటా శ్రీనివాసరావు నటన ప్రత్యేకంగా ఉంటుంది.