‘భక్త కన్నప్ప’ సినిమా గురించి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు చాలా ఏళ్లుగా చెబుతున్నారు. విష్ణు హీరోగా ఆ సినిమాను చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. చాలామంది రచయితలు, దర్శకులు ఈ సినిమా గురించి బ్యాక్ ఎండ్‌లో పని చేశారు. కానీ సినిమా ఎందుకో కానీ పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు సినిమాను పట్టాలెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో భారీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో విష్ణు అని తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా రచయిత కూడా అతనే.
మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా ‘కన్నప్ప’ సినిమా ప్రీ లుక్ ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. అందులో నిశితంగా పరిశీలిస్తే దిగువ పేర్లలో విష్ణు పేరు కనిపిస్తుంది. అయితే అది హీరోగా, నిర్మాతగా కాదు.. రచయితగా. ఎందుకంటే ఈ సినిమా రైటింగ్‌ను కూడా విష్ణునే హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి సిద్ధం చేసిన కథకు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు తదితర పనులను విష్ణు చూసుకున్నాడట. అందుకే ఆయన పేరు వచ్చింది అని చెబుతున్నారు.
నిజానికి విష్ణు సినిమా కోసం పెన్ను పట్టుకోవడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఓ సినిమా కోసం కథ, స్క్రీన్‌ప్లే రాశాడు. అదే సంపూర్ణేశ్ బాబు హీరోగా వచ్చిన ‘సింగమ్ 123’. సెటైరికల్ కామెడీగా వచ్చిన ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. అయితే సీరియస్ సినిమాకు రైటర్‌గా చేయడం అంత ఈజీ కాదు. కానీ ఆ డేరింగ్ స్టెప్‌ను మంచు విష్ణు తీసుకోవడం గమనార్హం. నటుడిగా, నిర్మాతగా తనను తాను ఇప్పటికే నిరూపించుకున్న (Manchu Vishnu) విష్ణు… ఇప్పుడు రైటర్‌గానూ రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
టీమ్ విడుదల చేసి టీజర్ లుక్‌లో పూర్తి స్పష్టత లేకపోయినప్పటికీ మంచు శివలింగం ముందు ధనుస్సు ధరించిన కన్నప్ప కనిపిస్తున్నాడు. అయితే సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉండబోతోందో ఆ పోస్టర్‌తో చెప్పారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్, నయనతార, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ లాంటివాళ్లు నటిస్తున్నారు. ‘కన్నప్ప’ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్‌లో శరవేగంగా జరుగుతోంది.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!