‘మీలో మంచి నటుడు ఉన్నప్పటికీ మీరు ఎందుకు నటించడం లేదు?’ అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. దర్శకధీరుడు రాజమౌళిని (S. S. Rajamouli) ప్రశ్నిస్తే …’కుక్క పని కుక్క చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇది.మొన్నటికి మొన్న కొరటాల శివ (Koratala Siva) కూడా ‘దేవర’ (Devara) ప్రమోషన్స్ లో.. ‘ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది.. ఎవడి పని ఆడు చేసుకుంటే’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇవి మన యంగ్ హీరోలకి కరెక్ట్ గా సరిపోతాయేమో అనిపిస్తుంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
వాళ్ళు మరెవరో కాదు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) .. ! ఈ హీరోల విషయంలో దర్శకుల నుండి నిర్మాతల నుండీ చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఈ హీరోలు చేసే సినిమాల విషయంలో దర్శకులకి వీళ్ళు చుక్కలు చూపిస్తూ ఉంటారట. ముందుగా కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. నిర్మాతల్ని సెట్స్ కి రావద్దని చెబుతాడట. దర్శకులు టేక్ ఓకే చేయకపోయినా.. తనకు ఓకే అనిపిస్తే సరిపోతుందట. మెయిన్ గా ఇతనికి ఎలివేషన్ సీన్స్ ఎక్కువగా అడిగి మరీ పెట్టించుకుంటాడు అని, చివరికి డిఐ వద్ద కూడా ఇతని హడావుడి ఎక్కువగా ఉంటుందని టాక్.
ఇక విశ్వక్ సేన్ (Vishwak Sen) విషయానికి వస్తే.. డోసేజ్ 10 రెట్లు ఉంటుంది. ఎక్కడా డైరెక్టర్ మార్క్ కనిపించదు. సీనియర్ హీరో అర్జున్ ఈ విషయంపై ఓపెన్ గానే చెప్పారు. ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ వంటి సినిమాని డైరెక్ట్ చేసిన రామ్ నారాయణ్ … విశ్వక్ సేన్ తో ‘లైలా’ (Laila) చేశాడు. అసలు ఆ సినిమాలో రామ్ నారాయణ్ మార్క్ అనేది కనిపించలేదు. విశ్వక్ కెలుకుడు వల్లే ఆ సినిమా ఫలితం అలా అయ్యింది అనేది ఇన్సైడ్ టాక్. ఇక సిద్ధు జొన్నలగడ్డ సంగతి సరే సరి.
రీసెంట్ గా వచ్చిన ‘జాక్’ ను (Jack) ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) సినిమా అంటే అతని మార్క్ కచ్చితంగా ఉంటుంది. అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. కొన్ని సీన్స్ హృద్యంగా ఉంటాయనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. కానీ ‘జాక్’ లో దర్శకుడి మార్క్ కనిపించదు. సిద్దు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చెయ్యి ఎక్కువ పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తుంది. నవీన్ పోలిశెట్టి వంటి హీరోలు కూడా స్క్రిప్ట్ పనుల్లో ఇన్వాల్వ్ అవుతారు అనే టాక్ ఉంది. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు వేలు పెట్టరు అని అతనితో పనిచేసిన వాళ్ళు చెబుతూ ఉంటారు.