ప్రజల కోసం టికెట్ రేట్లు తగ్గించాం… మళ్లీ చిత్ర పరిశ్రమ అడిగిందని టికెట్ రేట్లు పెంచాం… అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం ఏం చెప్పినా… ప్రభుత్వ పెద్దల మనసులో ఏముందో అందరికీ తెలుసు. తొలుత టికెట్ ధరలు తగ్గింపు విషయం ఎప్పుడు ప్రారంభించారు, ఆ తర్వాత మళ్లీ పెంచుతామని చెప్పినా ఏ సినిమా కోసం ఆపారు అనేది మీకు తెలుసునే అనుకుంటాం. ఈ రెండు ప్రశ్నలకు, అసలు టాలీవుడ్ ఏపీలో ఎదుర్కొంటున్న చాలా సవాళ్లకు సెంటరాఫ్ పర్సన్ పవన్ కల్యాణ్.
ఆయన కోసమే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల ఆట ఆడింది అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం ఓ విషయంలో పవన్‌ను ఇబ్బందిపెట్టలేకపోయింది అనొచ్చు. నిజానికి ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కంటే ముందే ఏపీలో సినిమా టికెట్ రేట్ల కొత్త జీవో వస్తుంది అన్నారు. కానీ ఏదేదో కారణాలు చెప్పి ప్రభుత్వం ఆపుతూ వచ్చింది. ఆఖరికి ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు జీవో జారీ చేసింది. ‘భీమ్లా నాయక్’కు కొత్త టికెట్ రేట్ల వల్ల ఉపయోగం ఉండదు, సినిమా థియేటర్ల నుండి తీసేశారు అన్నాకనే…
ఈ కొత్త జీవో తెచ్చారు అని సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏపీలో ‘భీమ్లా నాయక్’ కొత్త టికెట్ ధరలతో ఆడుతోంది. ‘రాధేశ్యామ్’ క్లాస్ సినిమాగా పేరు తెచ్చుకోవడంతో చాలామంది థియేటర్లకు వెళ్లి ‘భీమ్లా నాయక్’ చూస్తున్నారు. అది కూడా కొత్త రేట్లతో. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ మూడో వారం రన్‌లో ఉంది. ఏపీలో ఈ క్రమంలో కొత్త రేట్లకే ‘భీమ్లా నాయక్’ ప్రదర్శిస్తున్నారట.
ఆ మధ్య మేం పాత రేట్లతో ప్రదర్శించలేం అని చేతులెత్తేసిన థియేటర్ల యజమానులు కొత్త రేట్లతో షోలు వేస్తున్నారట. ఈ లెక్కన ‘భీమ్లా నాయక్’ విషయంలో ఏపీ ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు అనే చెప్పొచ్చు. ఇవే కొత్త రేట్లు ఏపీలో ఫిబ్రవరి 25 నుండి ఉండి ఉంటే… వసూళ్లు ఇంకా ఘనంగా ఉండేవి. ప్చ్ ఏం చేస్తాం.