తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా ఛాన్స్‌లు రావడం అరుదు అంటుంటారు. అయితే ఈ మాట నిజం కాదు అని చెబుతూ.. కొంతమంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. అయితే మిగిలిన నాయికల్లా స్థిరపడుతున్నారా అంటే లేదనే చెప్పాలి. వేగంగా ఒకట్రెండు సినిమాలు చేసి ఠక్కున మాయమైపోతున్నారు. దీనిపై ఇప్పటికే చాలామంది మాట్లాడారు, మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటారు కూడా. అయితే మేం అనుకున్నట్లుగా సాగితే సంబరాలు చేసుకుంటాం అని అంటోంది డింపుల్ హయాతి.
వినడానికి నాన్ తెలుగు పేరులా కనిపించినా.. (Dimple Hayathi)ఆమె తెలుగమ్మాయే అనే విషయం తెలిసిందే. ‘రామబాణం’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న ఈ అమ్మడు తాజాగా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రాణించడం గురించి మాట్లాడింది. దీంతో ఆమె మాటలు వైరల్‌గా మారాయి. నేను నా రెండో ప్రాజెక్ట్‌గా ‘రామబాణం’ సినిమా చేస్తున్నానంటేనే పరిస్థితి మారిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సినిమా మారింది, ప్రేక్షకులు కూడా మారారు. సినిమాల కోసం మమ్మల్ని సంప్రదించే విధానం కూడా మారింది అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది డింపుల్.
ఇప్పుడు టాలీవుడ్‌లో భాష, రంగు లాంటి విషయాల్లో ఒకప్పటిలా సంకోచాలు, సందేహాలు లేవు. అయితే ఈ విషయాల్లో ఇంకా చాలా మార్పు రావాలి. పరిశ్రమలో మరో ఐదారుగురు తెలుగు కథానాయికలు వచ్చినప్పుడు మేం సంబరాలు చేసుకుంటాం అని చెప్పింది డింపుల్. దీంతో ఇండస్ట్రీలో తెలుగు నాయికల పరిస్థితి గురించి మరోసారి చర్చ మొదలైంది. అసలెందుకు తెలుగు అమ్మాయిలు రాణించడం లేదు, లేదంటే ఎందుకు వారిని తీసుకోవడం లేదు అంటూ లెక్కలేస్తున్నారు.
అయితే దీనికి సమాధానం కోసం గతంలో ప్రయత్నాలు జరిగాయి ఎలాంటి సమాధానం రాలేదు. ఇప్పుడు వస్తుందేమో చూడాలి. ‘గద్దలకొండ గణేష్’ సినిమాలోని స్పెషల్ సాంగ్ తర్వాత అంతా తనను గ్లామర్ కోణంలోనే చూశారట. ఆ తర్వాత ‘ఖిలాడీ’ సినిమాలో చూసి మరో రకమైన అంచనాలు ఏర్పడ్డాయట. దీంతో తనపైన ఉన్న ముద్రను తొలగించుకుంటూ… నేను సినిమాలు చేయడానికి కాస్త సమయం పట్టింది అని చెప్పింది డింపుల్.