Cine Workers: పెంచితేనే వస్తామని వాళ్లు.. మేం చెప్పే వరకు ఆగండని వీళ్లు!

  • June 23, 2022 / 01:29 PM IST

టాలీవుడ్‌ సినిమాలపై, కొన్ని బాలీవుడ్‌ సినిమాలపై కార్మికుల సమ్మె ప్రభావం పడింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్‌లో కొన్ని సినిమాల చిత్రీకరణలు బుధవారం నుండి ఆగిపోయాయి. ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండా కార్మికులు సమ్మె పిలుపునిచ్చారు. దీంతో నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లింది అని చెబుతున్నారు. ఇలా చేయకపోతే మాకు వేతనాల పెంపు చేయరు అంటూ కార్మికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఏం జరిగిందంటే…వేతనాల పెంపు కోరుతూ సమ్మెకు పిలుపు నిచ్చి, నిరసన చేప్టటారు కార్మికులు.

దీంతో తొలుత నిర్మాతల మండలి స్పందించింది. కార్మికుల సమ్మె విషయంపై బుధవారం మధ్యాహ్నం సమావేశమైన నిర్మాతల మండలి కార్మికులకు వేతనాలు పెంచడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. గురువారం నుండి షూటింగ్‌లో పాల్గొనాలని కోరారు. కార్మికులందరూ షూట్స్‌కి ఎప్పటిలాగా వస్తేనే వేతనాలు, విధివిధానాలపై వీలైనంత త్వరగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని నిర్మాత మండలి తరఫున సి.కల్యాణ్‌ చెప్పారు. అయితే వేతనాలను 45 శాతం పెంచితేనే షూటింగ్స్‌కు హాజరువుతామని ఫిల్మ్ ఫెడరేషన్ సాయంత్రం స్పష్టం చేసింది.

వేతనాలు పెంచాలనుకునే నిర్మాతల నుంచి రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఫెడరేషన్‌ ప్రతినిధులు వెల్లడించారు. ‘‘మేం పాత వేతనాలతో షూటింగ్‌లకు వెళ్లం. కొత్త జీతాలతోనే హాజరవుతాం. నిర్మాతలు హెచ్చరికలు చేసినట్లుగా మాట్లాడారు. వేతనాలు పెంచకపోతే మూకుమ్మడి ఆందోళనలు కొనసాగుతాయి’’ అని చెప్పారు ప్రతినిధులు. బుధవారం 25 సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయని చెప్పిన వారు. చిత్రీకరణ ఆగిపోవడంతో ఐదు వేల మందికిపైగా కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. అయితే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చొరవతో నిర్మాతలతో చర్చలకు వెళ్తాం అని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ చెప్పారు.

ఈ రెండు వ్యవహారాలపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి స్పందించింది. గురువారం నుంచి 15 రోజులపాటు పాత పద్ధతిలోనే సినీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని నిర్మాతలకు సూచించింది. ఫిల్మ్ చాంబర్ నిబంధనలకు విరుద్ధంగా ఎవరూ కార్మికులకు వేతనాలు చెల్లించవద్దని స్పష్టం చేసింది. సినిమా చిత్రీకరణల వివరాలు ఎప్పటికప్పుడు ఫిల్మ్ చాంబర్‌కు తెలిపాలని, నిర్మాతలెవరూ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకొవద్దని కోరింది. కార్మిక సంఘాల ఒత్తిళ్లకు ఎవరూ లొంగక్కర్లేదని… ఛాంబర్‌ సమావేశాల్లో తీసుకునే నిర్ణయాలు నిర్మాతలందరికీ తెలియజేస్తామని స్పష్టం చేసింది. మరి గురువారం ఏం జరుగుతుందో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus