కరోనా తర్వాత టాలీవుడ్‌లో చాలా మార్పులొచ్చాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మార్పు. మన స్టార్ హీరోలు ఒకేసారి వరుస సినిమాలు ఓకే చేసేస్తున్నారు. అనౌన్స్‌మెంట్‌లు అధికారికంగా, అనధికారికంగా ఇచ్చేస్తున్నారు. కొందరైతే సినిమాలు మొదలుపెట్టేసి పక్కనపెట్టేస్తున్నారు. అలా ప్రకటించి /చెప్పి ఆగిన సినిమాలు, అనౌన్స్ చేసి కిక్కురమనకుండా కామ్‌గా ఉన్న చిత్రాల్లో స్టార్ హీరోలవే ఎక్కువున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
* అనౌన్స్‌మెంట్‌లు వచ్చి ఇంకా మొదలుకాని సినిమాల సంగతి చెప్పాలంటే తొలుత పవన్ కల్యాణ్ గురించే చెప్పాలి. క్రిష్ ‘హరి హర వీరమల్లు’ సినిమా మొదలై నత్తనడకలో సాగుతోంది. హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ పోస్టర్లు వచ్చేసి ఆ తర్వాత ఉలుకూ పలుకూ లేదు. అయితే సినిమా ఉంది అంటున్నారు.. ఎప్పుడో చెప్పరు.
* ఈ రెండూ కాక పవన్ కల్యాణ్ నుండి మరికొన్ని సినిమాలు అనౌన్స్ అయ్యాయి. అందులో ఒకటి రామ్ తాళ్లూరి – సురేందర్ రెడ్డి సినిమా. దీని తర్వాత భగవాన్ – పుల్లారావు నిర్మాణంలో ఓ సినిమా అన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లతో సినిమా అన్నారు. వీటిపై కూడా నో క్లారిటీ. ఇక ‘వినోదాయ చిత్తాం’ పుకార్ల సంగతి మీకు తెలిసిందే.
* ‘పుష్ప’ విడుదలైన కొద్ది రోజులకు ‘పుష్ప 2’ స్టార్ట్ చేసేస్తాం అని అన్నారు టీమ్. అయితే సినిమా వచ్చి ఆరు నెలలు అయిపోతోంది. ఇప్పటివరకు ఆ సినిమా మొదలవ్వలేదు. పోనీ బన్నీ మరో సినిమా స్టార్ట్ చేస్తారు అంటే అదీ అవ్వడం లేదు. బోయపాటి శ్రీను, మురుగదాస్, సంజయ్ లీలా భన్సాలీ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి తప్ప పని కావడం లేదు.
* ‘ఆర్‌ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ సినిమా కొరటాల శివతో అన్నారు. నిజానికి జూన్‌లో సినిమా మొదలవ్వాలి. కానీ కథలో మార్పులు చేస్తుండటంతో ఆలస్యం అంటున్నారు. జులైలో అయినా మొదలవుతుందో లేదో తెలియదు. ఆ విషయం పక్కన పెడితే బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సినిమా అనధికారికంగా అనౌన్స్ చేసినా ఇంకా ఆ విషయమేమీ తేలడం లేదు.
* ఇక మహేష్‌బాబు పరిస్థితీ దాదాపు ఇంతే. త్రివిక్రమ్‌తో సినిమా అని, జూన్‌లో స్టార్ట్ అన్నారు. ఆరో నెల పూర్తియిపోయింది. ఇంకా రెగ్యులర్ షూట్ మొదలవ్వలేదు. అలాగే రాజమౌళి సినిమా కథ ఫైనల్ చేస్తాం అని కూడా ఆ మధ్య అన్నారు. చర్చలు కూడా అయ్యాయి. ఆ సినిమా కథ ఇంకా తేలలేదు.