నిన్న రాత్రి నాటకీయ పరిణామాల కారణంగా “వాల్మీకి” సినిమా టైటిల్ ను “గద్దలకొండ గణేష్”గా మార్చిన విషయం అందరికీ ఈపాటికే తెలిసి ఉంటుంది. ఇలా ఆఖరి నిమిషంలో టైటిల్ మార్చడం అనేది ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. గతంతో “కొమరం పులి” చిత్రానికి కూడా ఇలాగే ఆఖరి నిమిషంలో “కొమరం” అనే పదాన్ని తొలగించి “పులి” అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. కానీ.. ఇప్పటికీ ఆ చిత్రాన్ని అందరూ “కొమరం పులి” అనే అంటారు.. అందరికీ అలాగే గుర్తుంది. ఈమాత్రం దానికి అప్పట్లో కొమరం భీమ్ బంధువులు ఎందుకని అంత గొడవ చేశారు అనే విషయం ఎవరికీ అర్ధం కాదు.
అదే తరహాలో ఇప్పుడు బోయ కమ్యూనిటీ పెద్దలు అందరూ కలిసి సినిమా విడుదల రేపు అనగా.. కలెక్టరేట్ దగ్గర నానా యాగే చేసి “వాల్మీకి” టైటిల్ ను విజయవంతంగా “గద్దలకొండ గణేష్”గా మార్చి ఏం సాధించారు అంటే ఎవరి దగ్గరా పెద్ద సమాధానం లేదు. అయినా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డ్ & ఫిలిమ్ ఛాంబర్ నుంచి ఒకసారి అనుమతి వచ్చిన తర్వాత మళ్ళీ అదే ప్రభుత్వం సినిమా విడుదలను నిలిపివేయాలని గోల చేసినవారికి సపోర్ట్ చేయడం హాస్యాస్పదం. మరి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకొంటుందో లేక.. ఇలానే వదిలేసి ఫిలిమ్స్ మేకర్స్ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయేలా చేస్తుందో చూడాలి.