కొత్త సినిమా విడుదల ఎప్పుడు? అని ఆలోచించే సినిమా ప్రేక్షకులు… ఇప్పుడు థియేటర్లు తెరిచేది ఎప్పుడు అని ఆలోచించేంతగా మారిపోయింది పరిస్థితి. ఈ మాయదారి కరోనా ప్రళయం విడతలుగా కొనసాగుతుండటంతో సినిమా థియేటర్లు ఈ ఏడాది కూడా నిరవధికంగా మూసేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎప్పుడు మళ్లీ తెరుస్తారు అనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు. అంతా దైవాధీనం అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో థియేటర్లకు అనుమతి వచ్చినా…
ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం ఇంకా అనుమతులివ్వలేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరిచే పరిస్థితి ఏర్పడలేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి థియేటర్లు ఓపెన్ చేయాలని టాలీవుడ్ భావిస్తోందట. ఏపీలో థియేటర్ల విషయంలో పర్మిషన్ ఎప్పుడొస్తందనేది ఇంకా తెలియడం లేదు. ఈ విషయంలో నిర్ణయం వచ్చాకే… తమ సినిమాల రిలీజ్ తేదీలను ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం అయితే జులై చివరి వారం లేదా ఆగస్టు తొలి వారంలో థియేటర్లు ఓపెన్ చేస్తారని తెలుస్తోంది.
ఈ మేరకు నిర్మాతల దగ్గర సమాచారం ఉందని తెలుస్తోంది. కాబట్టి… తెలుగు సినిమాల విడుదల తేదీలు… ఆగస్టులోనే ఉండబోతున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమాలు ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయి. తొలుత చిన్న సినిమాలు వరుస కడతాయన్నమాట.