‘దృశ్యం 3’ సినిమా గురించి గత కొన్ని నెలలుగా చాలా రకాల డిస్కషన్లు జరుగుతున్నాయి. దానికి కారణం ఆ సినిమాను ఒకదాని తర్వాత మరొకటి అనేలా రీమేక్ చేయకుండా ఒకేసారి అన్ని భాషల్లో తెరకెక్కించాలి, విడుదల చేయాలని అనుకోవడమే. ముగ్గురు వేర్వేరు హీరోల డేట్స్ ఒకేసారి కుదరడం అంత ఈజీ కాదు. వేర్వేరు షూటింగ్‌లు చేసి మూడు భాషల్లోనూ ఒకేసారి సినిమా విడుదల చేయాలి అనుకోవడం కూడా సాధ్యం కాదు. ఈ చర్చ ఇలా సాగుతుండగానే సినిమా గురించి మరో అప్‌డేట్ వచ్చింది.
‘దృశ్యం 3’ సినిమా మలయాళం వెర్షన్ చిత్రీకరణ ఇప్పటికే మొదలైంది. దర్శకుడు జీతూ జోసెఫ్ స్పీడ్ గురించి తెలిసినవాళ్లు ఈ సినిమా చిత్రీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసేస్తారు అని చెప్పొచ్చు. అయితే ఇతర భాషలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. హిందీలో అజయ్ దేవగణ్, తెలుగులో వెంకటేశ్ ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు. మరోవైపు సినిమా నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ మూవీస్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్, డిజిటల్ రైట్స్‌ను విక్రయించేసింది.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పనోరమా స్టూడియోస్ ఈ సినిమా విడుదల హక్కులను సొంతం చేసుకుంది. దీని కోసం రూ.160 కోట్లు ఇచ్చిందని చెబుతున్నారు. హిందీ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే పనోరమా ‘దృశ్యం 3’ విషయంలో ముందుకు రావడంతో మలయాళం, హిందీని ఆ సంస్థే విడుదల చేస్తుందని చెప్పేయొచ్చు. అంటే హిందీ సినిమా షూటింగ్ అవ్వకుండా, మలయాళ సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అని చెప్పాలి. తెలుగులో అయితే సురేశ్ ప్రొడక్షన్సే హ్యాండిల్ చేసుకుంటుంది.
తెలుగు వెర్షన్ చేయాల్సిన వెంకటేశ్ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. మరి తెలుగు వెర్షన్ వరకు పనోరమ పిక్చర్స్ ఆగుతుందా? లేక హిందీ, మలయాళ వెర్షన్‌ను ముందు రిలీజ్ చేసేస్తారా అనేది చూడాలి. ఒకవేళ అదే జరిగితే ‘దృశ్యం’ సిరీస్ ఫ్యాన్స్‌కి నిరాశ ఎదురైనట్లే.