ఎన్నికలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రాజకీయ నాయకులు, వారి బల ప్రదర్శనలు, ప్రసంగాలు, సమావేశాలు, విమర్శలు. అయితే అవి ఐదేళ్లకొకసారి జరుగుతాయి. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఎన్నికలు రెండేళ్లకొకసారి జరుగుతాయి. గత రెండు పర్యాయాలుగా చూస్తే… రాజకీయాలకు, ‘మా’ ఎన్నికలకు పెద్ద తేడా కనిపించడం లేదు. ‘మా’కు రాజకీయం ఆపాదించొద్దు అంటూనే… రాజకీయం చేసేస్తుంటారు. తాజాగా ఈసారి ఎన్నికలు కూడా అలానే తయారయ్యాయి. అందులో తొలి ఘట్టం. ప్రెస్ మీట్లు, రెండోది ఆ క్రమంలో చేసే బలప్రదర్శన.
‘మా’ ఎన్నికల్లో ఈ ఏడాది ప్రకాశ్ రాజ్ అధ్యక్షపదవికి పోటీ చేస్తారని ఏప్రిల్‌లోనే చూచాయగా తేలిపోయింది. ‘వకీల్‌సాబ్’ సమయంలో చిరంజీవి కుటుంబాన్ని ఆకాశానికెత్తేస్తుంటే… ‘ఏదో జరుగుతోంది’ అంటూ అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పేశారు. ఆ తర్వాత ప్యానల్ కూడా ప్రకటించేశారు. ఈ క్రమంలో పోటీలో ఇంకెవరు ఉంటారనేది కూడా తేలిపోయింది. విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పేర్లు బయటకు వచ్చాయి. అయితే వీరిలో ప్రకాశ్‌రాజ్ ప్యానలే అన్ని విషయాల్లోనూ ముందుంది.
ఎన్నికల విషయంలోనే ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఎంత ముందు ఉందో చెప్పాలంటే… మొన్న జరిగిన బల ప్రదర్శనే నిదర్శనం. మాకు ఇంత బలం ఉంది అని చూపించడానికే అందరినీ పిలిచి స్టేజ్ ఎక్కించి మరీ చూపించారు. నిజానికి ఆ ప్రెస్ మీట్ అవసరం ఏంటి. ‘మేం ఏ చర్చలోనూ పాల్గొనం, మమ్మల్ని ఏ టీవీ ఛానల్ వాళ్లూ పిలవొద్దు’ అని చెప్పడానికి ప్రెస్ మీట్ అవసరం లేదు. ఏ ట్వీటో, ప్రెస్‌నోట్ ఇస్తే సరి. కానీ ప్రకాశ్‌రాజ్ అలా చేయలేదు. ఆ కార్యక్రమాన్ని తమ ప్యానల్ గురించి చూపిస్తూ, చిరంజీవి సపోర్టు ఉందని చెప్పడానికే పెట్టారు.
అక్కడితో పరిస్థితి ఆగిపోతుందని ఆయన అనుకున్నారేమో. కానీ ప్రెస్ మీట్ పంచాయితీ అక్కడితో ఆగితే మజా ఏముంటుంది. వెంటనే శనివారం ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ మరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ క్రమంలో మొన్నటి ప్రెస్ మీట్‌లో నాగబాబు మాటలను ఖండించారు. దీంతో టాపిక్ మళ్లీ మొదటికొచ్చింది. పనిలోపనిగా జీవిత రాజశేఖర్‌కు తమ సపోర్టు ఉంటుందని చెప్పకనే చెప్పారు.
ఇటీవల కాలం వరకు అధ్యక్షుడు నరేశ్‌కు, కార్యదర్శి జీవితకు పెద్దగా సత్సంబంధాలు లేవనే మాటలు వినిపించేవి. అవి పక్కనపెట్టి మరీ ప్రెస్‌మీట్ పెట్టి. కొంతమంది నటీనటుల్ని తీసుకొచ్చి బలప్రదర్శన చేశారు. పనిలోపనిగా తన మీద వచ్చిన విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు నరేశ్. అయితే రెండేళ్లుగా ‘మా’లో అసమర్థత ఉంది కానీ, ‘మా’ ప్రతిష్ఠ దెబ్బతినలేదు అన్నారాయన. దాని అర్థమేంటో ఆయనకే తెలియాలి.
ఈ వరుస చూస్తుంటే… ఈ క్రమంలో మరో రెండు ప్రెస్‌మీట్లు వచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే మంచు విష్ణు తన ప్యానల్ వివరాలు ఇంకా చెప్పలేదు. ఆయన కూడా ఈ విధానంలోనే ప్రెస్ మీట్ పెడతారు అంటున్నారు. ఇక మిగిలింది హేమ. ఆమె కూడా ఎన్నికల్ని సీరియస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె కూడా ఓ టీమ్‌తో బరిలోకి వస్తారట. ఒకవేళ ఇదే నిజమైతే ఆమె కూడా ప్రెస్‌మీట్ పెట్టి చెబుతారు. చూస్తుంటే ఈ ప్రెస్‌మీట్లు, బలప్రదర్శనలు ఇంకొంత కాలం నడిచేలా ఉన్నాయి. అయితే అవేమంత ‘మా’కు మంచిది కాదనే విషయం గ్రహించాలి.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!