యూట్యూబ్‌ రికార్డుల గోల ఎక్కువవుతోంది

  • June 11, 2021 / 02:10 PM IST

సినిమా – రికార్డులు రెండూ విడదీయరాని బంధం ఉన్న పదాలు. సినిమా వస్తోంది అంటే చాలు… దీనికి ఏయే రికార్డులు బద్దలవుతాయో అని అందరూ చూస్తుంటారు. ఈ క్రమంలో తొలినాళ్లలో అత్యధిక థియేటర్లలో మా సినిమా 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు, 365 రోజులు ఆడింది అనే రికార్డులు ఉండేవి. ఇప్పుడు అవి ఆగిపోయి యూట్యూబ్‌, ట్విటర్‌ రికార్డులు వచ్చాయి. ఈ ట్రెండ్‌ ఎంతలా మారిపోయిందంటే…

50 రోజులు 300 సెంటర్లు, 100 రోజులు 200 సెంటర్లు!.. ఈ తరహా రికార్డులు, ప్రచారం గురించి మీరు విన్నారా… నేటి తరం సినిమా అభిమానులకు ఈ విషయం గురించి తెలియదు కానీ… నిన్నటి తరం ఫ్యాన్స్‌కు మాత్రం బాగా తెలుసు. సినిమా విడుదలై 50 రోజులు అవుతుంది అంటే చాలు… ఇక లిస్ట్‌ కోసం అభిమానులు లెక్కలు మొదలుపెడతారు. సరిగ్గా ఏడు వారాలు వచ్చేటప్పటికీ చిత్రబృందం ఓ లిస్ట్‌ విడుదల చేస్తుంది. అది పట్టుకొని అభిమానులు పండగ చేసుకునేవారు. అయితే ఆ లిస్ట్‌లో ఎన్ని నిజాలు అంటే… లెక్క డౌటే.

తొలి రోజుల్లో ఈ లిస్ట్‌ పక్కాగానే ఉండేది. ఆ తర్వాత హీరోల మధ్య పోటీ వచ్చేసరికి లిస్ట్‌లో దొంగ లెక్కలు బయటికొచ్చాయి. 20 రోజులకు, 30 రోజులకు ఎత్తేసిన థియేటర్ల పేర్లు వచ్చి లిస్ట్‌లో కనిపించేవి. లిస్ట్‌లో పేరుండేది, ఆ ఊర్లో… ఆ థియేటర్లో చూస్తే సినిమా ఉండేది కాదు. ఇలాంటి లిస్ట్‌లు, ఫేక్‌లెక్కలు ఎన్నో. అయితే క్రమేణా ఈ పరిస్థితి మారిపోయింది. సినిమా అంటే వారం లేదా రెండు వారాలు అనే పరిస్థితి వచ్చింది. దీంతో థియేటర్ల లెక్కలు రావడం లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి థియేటర్ల లెక్కల నుండి యూట్యూబ్‌ మీదకు వచ్చేసింది.

యూట్యూబ్‌ వ్యూస్ ఆధారంగా సినిమా మీద హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది టాలీవుడ్‌. అందుకే పోస్టర్‌తో చెప్పే అవకాశం ఉన్నవాటికి కూడా ఓ వీడియో విడుదల చేసి, మా వీడియోకు ఇన్ని వ్యూస్‌ వచ్చాయి, ఇన్ని లైక్‌లు వచ్చాయి. మా సినిమా తోపు, అందుకే ఈ హైప్‌ అంటూ చెప్పుకొస్తున్నారు. ఫస్ట్‌ మూవీ టీజర్‌/ట్రైలర్‌/ప్రిల్యూడ్‌/రోర్ అంటూ రకరకాల పేర్లతో వీడియోలు వచ్చేస్తున్నాయి. లక్షలు, కోట్లలో వ్యూస్‌ వస్తున్నాయి. అయితే ఈ లెక్కలు ఎంతవరకు నిజం అంటే… ఇవి కూడా డౌటే.

సినిమాకు సంబంధించి వీడియో విడుదల కావడం పాపం… అన్ని రకాల వెబ్‌సైట్లలో ఆ వీడియోను యాడ్స్‌గా పెట్టేస్తున్నారు. క్లిక్‌ చేస్తే వీడియో ప్లే అవుతుంది. దీంతోపాటు మనం యూట్యూబ్‌లో ఏ వీడియో చూసినా… ఆ తర్వాత రికమెండేషన్స్‌లో ఆ పర్టిక్యులర్‌ సినిమాకు సంబంధించిన వీడియో వచ్చేస్తోంది. అంటే ఈ వ్యూస్‌ అన్నీ… ప్రజలు వెతికి చూసేవి కావు. ఇక బాట్స్‌తో ఆన్‌లైన్‌ ట్రాఫిక్‌ను మేనేజ్‌ చేయొచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆన్‌లైన్‌ లెక్కలు నాట్‌ ష్యూర్‌.

యూట్యూబ్‌ గోల పక్కనపెడితే… ట్విటర్‌ ట్రెండింగ్‌ గోల మరొకటి. మా సినిమాకు సంబంధించి హ్యాష్‌ ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అవుతోంది అంటూ ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేస్తారు. ట్విటర్‌లో ట్రెండింగ్‌ గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. బాట్స్‌ అనే టాపిక్‌ వచ్చిందే ట్విటర్‌ నుండి. బాట్స్‌ అంటే ఏంటో కొత్త పదం కాదు. అవో చిన్న రకం టెక్‌ రోబోలు అన్నమాట. ట్వీట్లు వేయడం, లైక్‌లు చేయడం, రీట్వీట్‌ చేయడం అన్నీ… మనిషి లేకుండా టెక్నాలజీ సాయంతో చేసేయొచ్చు.

ఇదంతా ఫ్యాన్స్‌కు తెలియదా అంటే తెలుసు అనే చెప్పాలి. అయితే ఫలానా హీరో కంటే మన హీరో వ్యూస్‌, లైక్స్‌, కామెంట్స్‌ ఎక్కువ ఉండాలి అనే కోరికతో తెలిసిన టెక్‌ మ్యానేజ్‌ కాన్సెప్ట్‌ అవగాహనను పక్కనపెట్టేసి… అందరితోపాటు మా వీడియో తోపు, మా ట్వీట్‌ తోపు.. మా హీరో తోపు అని సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అందుకే థియేటర్ల రికార్డులు స్టైల్‌లో ఈ సోషల్‌ మీడియా రికార్డులు కూడా ఆగిపోతే బాగుండు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus