హాట్ హీరోయిన్ రాయ్ లక్ష్మి టైటిల్ పాత్ర పోషించిన తాజా చిత్రం “వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ”. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాయ్ లక్ష్మీ, పూజిత పొన్నాడల సొగసులను ప్రోమోలుగా కట్ చేసి ప్రేక్షకులని ఊరించిన దర్శకనిర్మాతలు.. థియేటర్లో వారిని ఏమేరకు అలరించగలిగారో చూద్దాం..!!
కథ: బెల్లంపల్లి అనే గ్రామంలో జనాలందర్నీ నానా ఇబ్బందులకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందే ఇద్దరు మధ్యవయస్కులు చంటి (ప్రవీణ్), పండు (మధునందన్). ఊరందరూ వీళ్ళని అసహ్యించుకుంటున్నా.. ప్రెసిడెంట్ కొడుకు శేఖర్ (రామ్ కార్తీక్) మాత్రం వీళ్లతో స్నేహంగా వ్యవహరిస్తుంటాడు. గౌరి (పూజిత పొన్నాడ)తో శేఖర్ ప్రేమను చక్కదిద్దడం కోసం చంటి-పండు చేసిన ఓ వెధవ పని వాళ్ళ జీవితాలను మార్చేస్తుంది. ఉన్నట్లుండి ఈ ఇద్దరి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది వెంకటలక్ష్మి (రాయ్ లక్ష్మీ). ఆమె ఎంట్రీతో చంటి-పండుల జీవితాలు మారిపోతాయి.అసలు చంటి-పండుల జీవితాల్లోకి వెంకటలక్ష్మీ ఎందుకు వస్తుంది? ఆమె కారణంగా వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన మార్పులేమీటీ? అనేది “వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు: మరి దర్శకుడు సరిగా చేయించుకోలేకపోయాడో.. లేక సన్నివేశాన్ని ఆర్టిస్టులకు అర్ధమయ్యేలా చెప్పలేకపోయాడో తెలియదు కానీ.. “రంగస్థలం” సినిమాలో దొరికిన ఒకే ఒక్క సన్నివేశంలోనే సుకుమార్ సైతం షాక్ గురయ్యే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మహేష్ కూడా ఈ సినిమాలో పేలవమైన నటనతో అలరించలేకపోయాడు. ఇక ప్రధాన పాత్రధారులైన ప్రవీణ్ ఏమో సప్తగిరిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తే.. మధునందన్ సత్యను కాపీ కొట్టడానికి ప్రయత్నించి కామెడీ చేస్తున్నామనే భ్రమలో కామెడీ తప్ప అన్నీ చేశారు.ఇక నిన్నమొన్నటివరకూ సైడ్ హీరోయిన్ రోల్స్ చేసుకుంటూ సైలెంట్ గా కెరీర్ ను నెట్టుకొస్తున్న పూజిత పొన్నాడను కూడా సెక్సీగా చూపించడానికి చేసిన ప్రయత్నం ప్రోమోల వరకూ వర్కవుట్ అయ్యిందేమో కానీ సినిమాకి పెద్దగా పనికిరాలేదు.
నాకు ఇదేమైనా కొత్తా అన్నట్లు డబుల్ మీనింగ్ డైలాగులు, అనవసరమైన ఎక్స్ పోజింగ్ తో క్యారెక్టర్ ను రక్తి కట్టించడానికి విశ్వప్రయత్నం చేసింది కానీ.. అది పెద్దగా ఫలించలేదు.
పంకజ్ కేసరి లాంటి మంచి ఆర్టిస్ట్ ని కూడా వరస్ట్ ఆర్టిస్ట్ గా ప్రొజెక్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన సినిమా ఇది.
సాంకేతికవర్గం పనితీరు: సంగీత దర్శకుడు హరి గౌర ట్యూన్స్ అన్నీ పాత సినిమాలను తలపించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా గొప్పగా ఏమీ లేదు. వెంకట్ ఆర్.శాఖమూర్తి సినిమాటోగ్రఫీ బడ్జెట్ కు తగ్గట్లుగా ఉందే తప్ప సినిమాకి పెద్దగా ప్లస్ అవ్వలేదు.
దర్శకుడు కిషోర్ కుమార్ కి సినిమా ఎలా తీయాలి అనే బేసిక్ నాలెడ్జ్ ఉంది కానీ.. తాటవర్తి కిరణ్ అందించిన కథ-కథనం మీద కనీస స్థాయి అవగాహన లేదు. ఆ కారణంగా రచయిత రాసుకున్న సన్నివేశాలను ఏదో అలా తీసుకుంటూ వెళ్లిపోయాడే కానీ.. ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా లేదా అనేది మాత్రం పట్టించుకోలేదు. దాంతో “వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ” సినిమా చూస్తున్న ప్రేక్షకులందరూ “వేర్ ఈజ్ ది ఎగ్జిట్ డోర్” అని వెతుక్కుంటూ ఉంటారు.
విశ్లేషణ: ప్రోమోల్లో రాయ్ లక్ష్మీ, పూజిత పొన్నాడ హాట్ గా కనిపించారు కదా.. సినిమా ఎలా ఉన్నా వాళ్ళను చూసి టైమ్ పాస్ చేయొచ్చు అని థియేటర్ కి వెళ్తే మాత్రం మీ మీద మీరే జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మీ ఇష్టం.