‘నువ్వు నాకు నచ్చావ్’.. కుటుంబ సమేతంగా ఎన్నిసార్లు చూసినా ఆనందించదగ్గ చిత్రం. వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. 24 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ టీవీల్లో తరచుగా టెలీకాస్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఆ సినిమా రచయిత త్రివిక్రమ్‌తో కలసి నిర్మాత స్రవంతి రవికిషోర్ కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు.
Vijay Bhaskar
అయితే, ఈ సినిమాను తెరకెక్కించిన విజయ్ భాస్కర్ గురించి ఎక్కడా పెద్దగా ప్రస్తావన రావడం లేదు. సినిమా రిలీజ్ అయినప్పుడు వెంకటేశ్ నటన గురించి, ఆర్తి అగర్వాల్ అందచందాల గురించి మాట్లాడారు. అక్కడక్కడా త్రివిక్రమ్ పంచ్‌ల ప్రస్తావన వచ్చింది. అయితే ఇప్పుడు రీరిలీజ్ విషయానికి వచ్చేసరికి ఆయన ప్రస్తావన పెద్దగా రావడం లేదు. నిజమే ఇప్పుడు విజయ్ భాస్కర్ కంటే త్రివిక్రమ్ పెద్ద దర్శకుడు కావొచ్చు. కానీ ఆయన ప్రస్తావన లేకుండా కేవలం త్రివిక్రమ్‌తోనే సినిమా ప్రచారం ముందుకు తీసుకెళ్లాలి అనుకోవడం ఎంత వరకు కరెక్టో టీమే చెప్పాలి.
ఇక ఈ సినిమా గురించి ఇటీవల త్రివిక్రమ్ మాట్లాడుతూ కొన్ని సినిమాలు డబ్బులు, మరికొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి. కొన్ని సినిమాలే ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొస్తాయి. అది ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో నాకు దక్కింది అని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. ఇక నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ఇప్పటికీ ‘నువ్వు నాకు నచ్చావ్’ నిర్మాత అంటే నన్ను చూసే విధానం వేరుగా ఉంటుంది. ఈ సినిమా రూపొందడానికీ, ఇంత బాగా రావడానికి ప్రధాన కారణం వెంకటేశ్ అని చెప్పుకొచ్చారాయన.