సినిమా పరిశ్రమలో మంది మార్బలం ఉన్నవాళ్లకు ఒక న్యాయం.. ఒంటరి వాళ్లకు ఒక న్యాయం ఉంటుందా? ఏమో ఒక్కోసారి పరిస్థితులు చూస్తుంటే అవును అనే అనిపిస్తుంది. దీనికి నటి పూనమ్ కౌర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. ప్రముఖ కథానాయిక సమంత (Samantha) , ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున (Nagarjuna) కుటుంబం గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ కొన్ని అభ్యంతరకర కామెంట్లు చేశారు. దీంతో దాదాపు టాలీవుడ్ మొత్తం స్పందించి తమ నిరసన తెలిపింది.
అయితే, గతంలో ఇదే పరిస్థితి టాలీవుడ్‌లో కొంతమంది నటులు, నటీమణుల గురించి కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటి కామెంట్లే చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం సినిమా జనాలకు ఉందో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు ఇదే ప్రశ్నకు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అడిగింది. దీంతో ఆమె ప్రశ్నకు సమాధాన ఎవరు చెబుతారో అనే మాట వినిపిస్తోంది.
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల మీద టాలీవుడ్ ఏకమై నిరసన తెలపడం హర్షించదగ్గ విషయమే. అయితే గతంలో జరిగిన విషయాల సంగతేంటి అంటూ పూనమ్ కౌర్ (Poonam Kaur) నిలదీసింది. నందమూరి, మెగా ఫ్యామిలీ ఆడపడుచుల గురించి ఇలాంటి కామెంట్లు వచ్చినప్పుడు టాలీవుడ్ ఎందుకు నోరు విప్పలేదు అనే అర్థం వచ్చేలా పూనమ్ కౌర్ మాట్లాడింది. గతంలో పోసాని మురళీకృష్ణ (Posani Krishna Murali) చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించింది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , పూనమ్ కౌర్ గురించి ఓ కాంట్రవర్సీ గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్ మీద అప్పట్లో పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేసిన విషయమూ తెలిసిందే. ఇంట్లోని ఆడవాళ్ళ గురించి కూడా పోసాని మాట్లాడారు. పరోక్షంగా పూనమ్ పేరును ప్రస్తావిస్తూ త్రివిక్రమ్ (Trivikram) , పవన్ కల్యాణ్ మీద కౌంటర్లు వేశారు. ఆ విషయాలను గుర్తు చేస్తూనే ఇప్పుడు పూనమ్.. ఈ కామెంట్లు చేసింది.