ఒకప్పుడు ఏదైనా సినిమా హిట్ కొట్టింది అంటే.. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారో, డబ్బింగ్ చేస్తున్నారో అనే వార్త వచ్చినప్పుడే తెలిసేది. అయితే ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఏ సినిమా ఎక్కడ విజయం సాధించినా.. ఆ సినిమా డబ్బింగ్, రీమేక్ వార్త వచ్చేలోపే తెలిసిపోతోంది. అలా ఓ సినిమాకు సంబంధించి వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు… ఈ సినిమాను ఎవరు తెలుగులోకి తీసుకొస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. అయితే తెచ్చేది వాళ్లే అంటూ ఓ లెక్కకు కూడా వచ్చేస్తున్నారు.
ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఇచ్చిన ఆ చిన్న సినిమా పేరు… (Hostel) ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’. అంటే ఆ హాస్టల్ అబ్బాయిలను వెతుకుతున్నారు అని. సినిమా పేరు బట్టే.. ఈ సినిమా జోనర్ ఏంటి అనేది తెలిసిపోతుంది. అవును.. కుర్రాళ్ల సినిమానే.. కాకపోతే రెగ్యులర్ కుర్రాళ్ల సినిమా కాదు. కొత్తగా ఉంటుంది. అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారు అంటారా? కావాలంటే మీకెవరైనా కర్ణాటకలో తెలిసినవాళ్లు ఉంటే.. అడిగి చూడండి ఈ సినిమా మేనియా గురించి వాళ్లే కథలు కథలుగా చెబుతారు. ఎందుకంటే అంతగా ఫేమస్ అయిపోయింది ఈ సినిమా.
మార్కెట్, క్రియేటివిటీ విషయంలో ప్రస్తుతం శాండిల్ వుడ్ దూసుకుపోతోంది. అవుట్ అఫ్ ది బాక్స్ ఐడియాలు, భారీ చిత్రాలతో ఒకేసారి అదరగొడుతోంది. ‘కేజీయఫ్’ లాంటి భారీ సినిమా అక్కడి నుండే వచ్చింది. అలాగే ‘కాంతార’, ‘777 ఛార్లీ’ కూడా అక్కడి నుండే వచ్చాయి. తాజాగా రెండో రకం సినిమాల క్రమంలో మరో సినిమా వచ్చింది. అదే ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’. నితిన్ కృష్ణమూర్తికి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఇది. నటీనటులు కూడా దాదాపు కొత్తవారే.
శుక్రవారం (జూలై 21న) ఈ సినిమా విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా అంతా ఓ హాస్టల్ వార్డెన్ శవం చుట్టూ తిరుగుతుంది. సూసైడ్ నోట్‌లో పేర్లు ఉన్న ఐదుగురు ఆ తర్వాత ఏం చేశారు అనేది సినిమా. ఈ సినిమాను రక్షిత్ శెట్టి సమర్పించారు. అంతేకాదు అతిథి పాత్రలో కూడా కనిపించాడు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోకి ఎవరు తెస్తారనే ప్రశ్న మొదలైంది. ఇలాంటి కథలను తొందరగా పసిగట్టే గీతా ఆర్ట్సే తీసుకొస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి.