దేశంలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. రోజుకు లక్షకు పైగా కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో చాలామంది కరోనా బారినపడుతున్నారు. సినిమా తారలు, సెలబ్రిటీలు కూడా దీనికేం అతీతం కాదు. అలా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు కూడా కరోనా వచ్చిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ చేసింది. దీనిపై అల్లు అరవింద్ తాజాగా స్పందించారు. కరోనా గురించి, టీకా గురించి తనదైన శైలిలో క్లాస్ తీసుకుంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
‘‘నాకు కరోనా వచ్చిన మాట వాస్తవమే. అయితే టీకా రెండు డోసులు తీసుకున్నాక కూడా కరోనా వచ్చిందనే మాట అవాస్తవం. నేను ఒక డోసే తీసుకున్నాను. అయితే ఆ తర్వాత కరోనా వచ్చింది. కానీ మూడు రోజులకే కుదుటపడ్డాను. కరోనా టీకా తీసుకోవడం వల్ల వేగంగా కోలుకున్నాను. నా స్నేహితుడు ఒకడు టీకా తీసుకోలేదు. దీంతో ఆయనకు వేగంగా నయం కాలేదు. ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు’’ అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఇక్కడిదాకా బాగానే ఉంది. అసలు అల్లు అరవింద్ ఇంతగా ఎందుకు రియాక్ట్ అయ్యారో అర్థం కావడం లేదు.
కరోనా వచ్చిన మాట వాస్తవం… అయితే రెండు డోసులు వేసుకున్నాక వచ్చిందని పుకార్లు వచ్చాయి. పుకార్ల విషయంలో ఎప్పుడూ పెద్దగా రియాక్ట్ కాని అల్లు అరవింద్ ఈ కరోనా పుకార్ల విషయంలో ఎందుకు అంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యారో అర్థం కావడం లేదు. అయితే కరోనా టీకా ఆవశ్యకత గురించి అర్థమయ్యేలా చెప్పడానికే అల్లు అరవింద్ అలా వీడియో చేశారని తెలుస్తోంది. వీడియోలో కూడా ఆయన అదే మాట చెప్పారు. కాబట్టి టీకా వేసుకోవడానికి అర్హులైనవాళ్లు వెంటనే వేసుకోండి మరి.