తమిళ చిత్రపరిశ్రమ నుండి టాలీవుడ్‌కి కథలు తెచ్చుకుంటున్నాం, హీరోయిన్లను తెచ్చుకుంటున్నాం, దర్శకులను తెచ్చుకుంటున్నాం… ఇన్ని చేసిన మనం వాళ్ల సేవా గుణాన్ని తెచ్చుకోలేమా? ఏమో మన హీరోల పద్ధతి చూస్తేంటే ‘ఆ ఒక్కటి తప్ప’ అని అర్థమవుతోంది. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్ కొరత ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మన చూసే వార్తలు, మనం వాడే ట్విటర్, మనం వాడే ఇన్‌స్టాగ్రామ్… మన హీరోలు, హీరోయిన్లు వాడుతున్నారు కదా.. వాళ్లకు కూడా ఆ కష్టాలు కనిపిస్తాయి. అయితే పక్కనే ఉన్న తమిళనాట హీరోలు చేస్తున్న సాయం మాత్రం వాళ్ల మసకగా కనిపిస్తోందా?
ఇటీవల కాలంలో తమిళనాడుకి స్టాలిన్ కొత్త సీఎంగా వచ్చారు. దీంతో చాలామంది సినిమా జనాలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. అలా అని ఓ పుష్ప గుచ్ఛం ఇచ్చి రావడం లేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల్ని అదుపులోకి తేవడానికి, ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి డబ్బులు రూపంలో సాయం చేస్తున్నారు. తాజాగా చూస్తే శివకార్తికేయన్ ₹25 లక్షలు, వెట్రిమారన్ ₹10 లక్షలు, జయం రవి, మోహన్‌రాజా ₹10 లక్షలు, దర్శకుడు శంకర్ ₹10 లక్షలు, దర్శకుడు మురుగదాస్ ₹25 లక్షలు, నటుడు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి ₹25 లక్షలు, స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ ₹లక్ష, దర్శకుడు అముదన్ ₹50 వేలు, సౌందర్య రజనీకాంత్ ₹కోటి, సన్ ప్రొడక్షన్స్ ₹30 కోట్లు, అజిత్ ₹25 లక్షలు, రజనీకాంత్ ₹50 లక్షలు… ఇలా ఇచ్చారు. ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి.
ఇవన్నీ పెద్ద మొత్తాలా? చిన్న మొత్తాలా? కొత్త సీఎం మెప్పుకోసమా? అనేది పక్కనపెడితే ఎవరూ అడగకుండానే సాయం చేశారు వీరంతా. మరి మన హీరోలు, హీరోయిన్లకు ఇవేవీ కనిపించడం లేదా? జాగ్రత్తగా ఉండండి అంటూ వీడియోలు, స్టే సేఫ్ అంటూ పోస్టులు, ప్లాస్మా దానం చేయండి అంటూ స్టేటస్‌లు పెట్టడం తప్ప ఇంకేమీ చేయరా? రేపొద్దున్న మీ సినిమాలు విడుదల అయితే ‘నా బ్లడ్ బ్రదర్స్’ అంటూ డైలాగ్‌లు చెబుతారు. ఇప్పుడు వాళ్లే కష్టాల్లో ఉన్నారు. అయినా మీ సంపాదన మీ ఇష్టం. సాయం చేయాలి అంటే చేస్తారు? లేకపోతే చేయరు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు అరక్షణం ఆలోచించను అనే డైలాగ్‌లు సినిమాలకే పరిమితమా?
కరోనా తొలి వేవ్ వచ్చినప్పుడు చేశాం కదా… ఇప్పుడు మళ్లీ చేయాలా అంటారా? అనే ప్రశ్న కొంతమంది అభిమానులు వేయొచ్చు. పదిసార్లు సాయం చేస్తే మంచిదే కదా… అయినా డబ్బుంది కాబట్టి వాళ్లను ఇవ్వమని చెప్పడం లేదు. ప్రజల డబ్బుతోనే, ప్రేమతోనే ఎదిగారు కదా. పక్క రాష్ట్రం హీరోలు చూపిస్తున్న శ్రద్ధ, అభిమానం మీరు చూపించలేరా? అనేదే మా ప్రశ్న. ప్రస్తుతం తుపానుతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. అక్కడ సహాయనిధి కోసం ఎవరైనా ప్రతిపాదన తెస్తే… ఏదో రాజకీయ మెప్పు కోసం వాళ్లకు మన హీరోలు డబ్బులిస్తారేమో. మొన్నామధ్య తమిళనాడులో తుపాను వస్తే ఇచ్చారు కదా. ఇక్కడ కూడా అలాంటి పని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!