సినిమా బడ్జెట్ బట్టి ధరలు ఉంటాయి అనే మాట మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం. టికెట్ ధరల పెంపు విషయంలో విమర్శలు వచ్చినప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ నిర్మాతలు ఈ మాట అంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పెద్ద సినిమా నిర్మాత ప్రభుత్వం దగ్గరకు వెళ్లి తమకు రిలీజ్ రెండు వారాలపాటు టికెట్ రేట్లు పెంచుకునే ఆప్షన్ ఇవ్వండి అని అడుగుతారు. ప్రభుత్వం ఇస్తుంది కూడా. అయితే ఈసారి ‘డాకు మహారాజ్’ సినిమాకు టికెట్ ధర పెంపు లేదు.
బాలకృష్ణ – బాబి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ నెల 12న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలు పెంచారు. అయితే తెలంగాణలో మాత్రం పెంచలేదు. ఏముంది టికెట్ ధరల పెంపు ఉండదు అని ప్రభుత్వం చెప్పింది కదా అనొచ్చు. అయితే రామ్‌చరణ్ – శంకర్ సినిమా ‘గేమ్ ఛేంజర్’కి పెంచారు. కాబట్టి ‘డాకు మహారాజ్’కి కూడా ఆ ఛాన్స్ ఉంది.
కానీ ఏమైందో ఏమో తెలంగాణ ప్రభుత్వం నుండి ‘డాకు మహారాజ్’ టీమ్‌కి ఆ ఛాన్స్ రాలేదు. మాకు పెంపు అక్కర్లేదు అని నిర్మాత నాగవంశీ చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెంచి, తెలంగతాణలో పెంపు ఎందుకు అవసరం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. ఈ లెక్కన టికెట్ రేట్ల కోసం తెలంగాణ ప్రభుత్వాన్ని నాగవంశీ సంప్రదించారా? సంప్రదించలేదా అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినిమా జనాలు కలిసినప్పుడు అందులో బాలకృష్ణ లేరు. ఆ తర్వాత ఆ హీరోలు, నటులు.. ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలకు మంచి చెప్పే వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ప్రజాప్రయోజనం ఉన్న అనే అంశాలను హైలైట్ చేస్తూ వీడియోలు చేసి రిలీజ్ చేస్తున్నారు. ఆ విషయం పక్కనపెడితే తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు లేకపోవడం నిర్మాతకు లాసే. మరి ఆ నష్టాన్ని నాగవంశీ లేదంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజు ఎందుకు భరిస్తున్నారు. ఎవరి కోసం భరిస్తున్నారు?