యువ నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) గత కొన్ని రోజులుగా చెబుతున్న విషయాలు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగడం లేదు. దీంతో ఆయన కాస్త మీడియా మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆ విషయం పక్కన పెడితే.. ఆయన చెప్పిన మరో మాట కూడా అయ్యేలా కనిపించడం లేదు. అదే ‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా రిలీజ్ డేట్. విజయ్ దేవరకొండ కెరీర్లో అత్యంత కీలకమైన సినిమాగా ‘కింగ్‌డమ్’ని చెప్పొచ్చు. విజయ్ (Vijay Devarakonda) గత చిత్రాలు ‘లైగర్’ (Liger) , ‘ఫ్యామిలీ స్టార్’(Family Star) దారుణమైన ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా విజయం సాధించడం అత్యవసరం.
ఇంత కీలకమైన ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్‌డేట్ లేదు. టీజర్ రిలీజ్ చేసి కావాల్సినంత బజ్ వచ్చిన తర్వాత సినిమా టీమ్ సైలెంట్ అయిపోయింది. ఆ మధ్య ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా ప్రచారంలో ‘కింగడమ్’ గొప్ప సినిమా, భారీ సినిమా అంటూ నిర్మాత నాగవంశీ ఆకాశానికెత్తేసే పని చేశారు. అయితే ఆయన చెప్పినంత ఊపు సినిమా టీమ్ నుండి కనిపించలేదు. దీంతో గత రెండు రోజులుగా ‘కింగ్‌డమ్ స్లో అయ్యిందా ఏంటి?’ అనే చర్చ మొదలైంది.
ఇదంతా సినిమా టీమ్ వరకు వెళ్లిందో ఏమో ఈ రోజు ఓ ఫొటోను రిలీజ్‌చేశారు. సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని ఆ ఫొటో సారాంశం. సినిమా ఫస్టాఫ్ డబ్బింగ్‌ని విజయ్ దేవరకొండ పూర్తి చేశాడు అంటూ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో విజయ్ ఉన్న ఫొటోను టీమ్ షేర్ చేసింది. దాంతోపాటు సినిమాను మే 30న విడుదల చేయడం కూడా పక్కా అని చెప్పేలా ఓ పోస్టు పెట్టారు. అలా తాజా పుకార్లకు ఫుల్ స్టాప్ అయితే పెట్టారు.
అయితే, ‘కింగ్ డమ్’ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. కాబట్టి వీలైనంత ఎక్కువ ప్రచారం చేసి దేశం మొత్తం విడుదల చేయాలి. మరి దీనికి 45 రోజుల సమయం సరిపోతుందా అనేది కూడా ఓ డౌట్. ఆ మాట అటుంచితే మళ్లీ ‘వాట్ లగాదేంగే’ లాంటి ఓవర్ హైప్‌లు విజయ్ దేవరకొండ ఏమన్నా ఇస్తాడేమో కూడా చూడాలి.