స్టార్స్ ని అభిమానులు దేవుళ్లుగా కొలుస్తుంటారు. తమ అభిమాన హీరో కనిపించగానే షేక్ హ్యాండ్ కోసం తపించేవారు కొందరైతే.. ఫోటోల కోసం ప్రయత్నించే వారు మరికొందరుంటారు. ఇంకా ఎక్కువగా అభిమానం ఉన్నవారైతే కాళ్ళమీద పడిపోతుంటారు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ కనిపించగానే వారి ఆశీర్వాదం తీసుకునేందుకు అభిమానులతో పాటు నటీ నటులు కూడా కాళ్లకు నమస్కరించేవారు. పెద్దల అశీసులు తీసుకోవడం మంచిదే కాబట్టి ఆ సంఘటనలు చూసినప్పుడు బాగానే ఉండేది. కానీ ఈ మధ్య స్టార్స్ చేసే పనులు అర్ధం కావడం లేదు. తమిళ హీరో సూర్య తాను నటించిన తానా సేంద్ర కూట్టం (గ్యాంగ్) సినిమా ప్రమోషన్లో అభిమానుల మధ్యకు వెళ్తే.. అక్కడ ఓ వ్యక్తి సూర్య కాళ్లకు నమస్కారం చేశారు. ఆ క్షణంలో ఏమి చేయాలో తెలియక సూర్య కూడా అతని కాళ్ళకి నమస్కారం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజాగా ఇలాంటి సంఘటన తెలుగు హీరోకి జరిగింది. వివి వినాయక్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటిలిజెంట్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా నిన్న “కళా కళామందిర్” అనే పాటను రిలీజ్ చేశారు. ఈ ఫంక్షన్ కి వచ్చిన అభిమానుల్లో ఒకరు సాయి ధరమ్ తేజ్ కాళ్లకు నమస్కరించడానికి వచ్చారు. వారిని చూసి ధరమ్ తేజ్ కూడా అభిమాని కాళ్లకు నమస్కరించారు. దీనిపై ఫిలిం నగర్లో చర్చ మొదలయింది. హీరోలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు. అయితే అభిమానులను కాళ్ల మీద పడవద్దని చెబితే వినరని, రివర్స్ గా అదే పని స్టార్స్ చేస్తే.. ఇతరులు అలా చేయడానికి ముందుకు రారని.. అందుకే స్టార్స్ ఇలా చేస్తున్నారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. హీరోల పాదాభివందనం వెనుక ఇదే బలమైన కారణం అయి ఉండవచ్చని చాలామంది అంగీకరిస్తున్నారు.