ఓవర్ సీస్ లో ఎందుకు తెలుగు చిత్రాలు హిట్ సాధిస్తున్నాయి ?

తెలుగు చిత్రాలకు ఓవర్ సీస్ మార్కెట్ లాభాలను తెచ్చి పెడుతోంది. అక్కడి పంపిణీదారులు మన సినిమాలను పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. విదేశాల్లో ఖాతా తెరవని మెగాస్టార్ చిరంజీవి చిత్రం కూడా ఈ సారి భారీ ధరకు అమ్ముడు పోయింది. ఆయన నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ 12 కోట్లకు ఓవర్ సీస్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ మొత్తం మొదటి వీకెండ్ లోనే వచ్చినట్లు సమాచారం. ఇలా తెలుగు చిత్రాలు విదేశాల్లో మార్కెట్ విస్తరించుకోవడానికి కారణాలను విశ్లేషిస్తే.. ఆసక్తికర విషయాలు బయట పడ్డాయి. వాటిలో మొదటిది కథ. ఏ భాషలోనో విజయం సాధించిన కథల జోలికి పోకుండా యువ దర్శకులు వినూత్న కథలను తీసుకుంటున్నారు. అందుకే ఎటువంటి స్టార్ హీరో లేకుండా కొత్తవారితో చేసిన “పెళ్లి చూపులు” సూపర్ సక్సస్ అయింది. ఓవర్ సీస్ లో ఈ మూవీ 8.16 కోట్లు కొల్లగొట్టింది. రెండో పాయింట్ కథలో ఒదిగి పోతున్న స్టార్ హీరోలు. ఇదివరకటి లాగా హీరోలు గిరి గీసుకుని కూర్చోవడంలేదు. కథకు తగినట్లుగా మారిపోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, కింగ్ నాగార్జున ఊపిరి సినిమాలు ఈ కేటగిరీకి వస్తాయి.

నాన్నకు ప్రేమతో 13 .43 కోట్లు వసూలు సాధించగా, ఊపిరి 10.43  కోట్లు రాబట్టింది. మరో ప్రధాన అంశం కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు. ఈ పాయింట్ తో సినిమా తీస్తే విదేశాల్లో ఉన్న తెలుగువారు మిస్ కాకుండా చూస్తున్నారు. అందుకు నిదర్శనమే అ .. ఆ మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 16 .37  కోట్లు సాధించి 2016 లో అత్యధిక ఓవర్ సీస్ కలక్షన్స్ వసూల్ చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాదు ఇటువంటి కథలను ఇక్కడ వారు ఆదరించకపోయినా అక్కడివారు బ్రహ్మరధం పడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం ఇక్కడ ఫెయిల్ అయినా, అక్కడ 7 . 77 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన కుటుంబ కథా చిత్రం శతమానం భవతి హౌస్ ఫుల్ కలక్షన్స్ తో సాగుతోంది. తెలుగు వారు విదేశాల్లో స్థిరపడినప్పటికీ వారు అనుబంధాలకు విలువ ఇస్తున్నారని ఈ చిత్రాల విజయాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ అమాశాలను దృష్టిలో పెట్టుకొని డైరక్టర్లు, హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఓవర్ సీస్ మార్కెట్ ని విస్తరించుకుంటున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus