మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (S. S. Rajamouli) సినిమా ఎంతవరకు వచ్చింది? మొన్నీమధ్యే సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పారు కదా.. టైమ్ పడుతుందని అంటారా! అవును నిజమే కానీ.. ఎంత సమయం పడుతుంది అనేదే పై ప్రశ్న సారాంశం. నిజం చెప్పాలంటే ఆ సినిమా ఇంకా అనౌన్స్ అవ్వలేదు. హీరో – దర్శకబృందం – నిర్మాత మాత్రమే తేలారు ఇప్పటివరకు. ఇదిగో అదిగో అంటూ కొబ్బరికాయ కొట్టే రోజు కోసం రకరకాల పుకార్లు వస్తున్నాయి కానీ.. ఎక్కడా తేలలేదు.
అయితే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. సినిమా కథ కోసం రెండు, మూడు నెలల సమయం తీసుకునే రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) ఈ సినిమా కోసం ఎందుకు అంత సమయం తీసుకుంటున్నారు అని. సుమారుగా ఈ సినిమా కోసం రైటింగ్ టీమ్ రెండేళ్ల సమయం తీసుకుంది. ఇంకా ఎన్ని నెలల సమయం పడుతుంది అనే విషయమూ క్లారిటీ రావడం లేదు. దీంతో కథకు రెండేళ్లు పడితే.. షూటింగ్‌కి, పోస్ట్ ప్రొడక్షన్‌కి ఇంకెన్నాళ్లు పడుతుంది అనేది ప్రశ్న.
రాజమౌళి గురించి తెలిసినవాళ్లకు ఈ ప్రశ్న కొత్తగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమా షూటింగ్‌కి ఎంత సమయం తీసుకుంటారో.. పోస్ట్ ప్రొడక్షన్‌కి కూడా అంతే సమయం పడుతుంటుంది. ఒక్కోసారి ఎక్కువే పడుతుంది. ఇక ప్రచారం సంగతి సరేసరి. ఈ లెక్కన మహేష్‌బాబు ఎన్నేళ్ల తర్వాత వెండితెరపై కనిపిస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే జక్కన్నతో సినిమా చేసేటప్పుడు ఆ హీరో వేరే సినిమా గురించి ఆలోచించే పరిస్థితే ఉండదు.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా ఉండనుంది. చాలా ఏళ్ల క్రితంఏ అడ్వాన్స్‌లు కూడా తీసేసుకున్నారు. ఈలోపు రాజమౌళి, మహేష్‌బాబు ఇతర సినిమాలతో బిజీ అయిపోవడంతో ఇప్పుడు చేస్తున్నారు. ఇద్దరి ఇమేజ్‌లు తెలిశాక ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అవుతుంది. ఎలాంటి ఫలితం వస్తుందో అభిమానులు, ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నాం.