“నీ ఉనికి ఉన్నంతవరకే నువ్ బ్రతికున్నట్లు.. ఒక్కసారి ఉనికి కోల్పోయావంటే నువ్ బ్రతికున్నా ఉపయోగం ఉండదు”. ఈ సామెత సినిమా ఇండస్ట్రీలో ఉండే వ్యక్తులకు చాలా బాగా సూట్ అవుతుంది. అయితే.. ఈ సామెతను మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద సీరియస్ గా తీసుకొంటున్నట్లు లేడు. అసలు మీడియాకి ముఖం చూపించని అజిత్ కూడా ఈ లాక్ డౌన్ టైంలో తన ఉనికిని ఘనంగా చాటుకొన్నాడు. అయితే.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రెస్ నోట్స్ కి పరిమితమైపోయాడు.
ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇచ్చినప్పటికీ.. అక్కడ పవన్ కళ్యాణ్ మార్క్ మిస్ అయ్యింది. ట్విట్టర్, ఫేస్బుక్ లో చాలా యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ తన ముఖాన్ని మాత్రం ఎవరికీ చూపించలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా ఉన్నాడు అనే విషయం ఆయన అభిమానులకు కూడా తెలియదు. పాపం వాళ్ళు ఆయన పాత ఫోటోలు, వీడియోలు చూసుకుని మురిసిపోతున్నారు. ఆయన సరికొత్త సినిమాల షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి అనే విషయంలో క్లారిటీ లేక అసలే అభిమానులు చిరాకుపడుతుంటే..
పవన్ కళ్యాణ్ ఏదో ఉపవాసం/దీక్ష చేస్తున్నారనే వార్త హల్ చల్ చేస్తుండడం ఎందుకో నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తోంది. అభిమానులకు స్పూర్తి నింపాల్సిన హీరో ఇలా దీక్షలు, వ్రతాలు చేసుకుంటూ టైమ్ పాస్ చేస్తుండడం, జనాల్లో ఉండాల్సిన జననేత కనీసం ఇల్లు కదిలి బయటకి రాకపోతుండడం ఆయన ఉనికిని దెబ్బతీసేలా ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా ఆయన సోషల్ మీడియా వేదికగా అయినా జనాల్ని పలకరిస్తే బాగుండు.