‘బ్రో’ సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా టైమ్ ఉంది. అయితే ఈ సినిమా టీజర్ వచ్చిన నేపథ్యంలో ఓ అంశం పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది. అదే ఈ సినిమా రిలీజ్ అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది. ‘ఎందుకు?’ అనే డౌట్ మీకొచ్చింది అంటే… కచ్చితంగా మీరు ‘వకీల్ సాబ్’ సినిమా టైమ్‌లో ఏపీలో జరిగిన విషయాలను ఫాలో అవ్వనట్లే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా సమయంలో ఏపీలో థియేటర్ల దగ్గర కొందరు ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ నాయకులు హంగామా చేశారు.
ఇప్పుడు (Bro Movie) ‘బ్రో’ సినిమా వస్తుండటంతో మరోసారి అలాంటి పరిస్థితి వస్తుందేమో అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ రాజకీయంగా మళ్లీ బాగా యాక్టివ్ అయ్యాడు. ‘భీమ్లా నాయక్’ సమయంలో ఇలాంటి పరిస్థితి అంతగా లేదు కానీ.. ఇప్పుడు మాత్రం బలంగా ఉంది. దీంతో ఈ సినిమా విడుదలకు ఏపీలో ఎన్ని అడ్డంకులు కలిగిస్తారో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుకున్నారు. దానికితోటు రూల్స్ అనే పేరుతో ఏపీలో ఎక్స్‌ట్రా షోలు, టికెట్ ధర పెంపు విషయంలోనూ అడ్డుపడతారేమో అంటున్నారు.
మొన్నటికి మొన్న వచ్చిన ‘ఆదిపురుష్’ సినిమాకు ఈ రూల్స్ ఏవీ వర్తించలేదు. ప్రభుత్వం గతంలో చెప్పిన ఏ మార్గదర్శకాన్ని ఫాలో కాకపోయినా ఆ సినిమా టికెట్ రేటు పెంపునకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో ‘బ్రో’ విషయంలో ఎలా ఆలోచిస్తారు అనేది అర్థం కావడం లేదు. ఒకవేళ ప్రభుత్వం మళ్లీ పాత రోజుల తరహాలో పట్టుపడితే సినిమా వసూళ్ల మీద ప్రభావం పడుతుంది. అది కూడా చాలా బలంగా ఉంటుంది అంటున్నారు.
ఎందుకంటే పవన్ సినిమాలకు ఏపీలో మంచి ఆదరణ ఉంటుంది. రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా ఉంటారు అంటారు. సినిమా మీద నిన్న మొన్నటివరకు అంతగా బజ్ లేకపోయినా ఇప్పుడు టీజర్ వచ్చాక మంచి జోష్ కనిపిస్తోంది. కాబట్టి ‘బ్రో’ సినిమా రిలీజ్ సమయానికి ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం జరిగిపోవాలి అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.