ఒకప్పుడు ఒక పెద్ద సినిమాతోపాటుగా మరో రెండు చిన్న సినిమాలు విడుదలయ్యేవి. 2004లో “శంకర్ దాదా” (Shankar Dada M.B.B.S) తోపాటుగా విడుదలైన “ఆనంద్” (Anand) సమానమైన సక్సెస్ ను అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే, ఆ సినిమాతోపాటుగా కాదు కదా కనీసం ఆ సినిమా విడుదలకు వారం ముందు, విడుదలైన వారం తర్వాత కూడా మరో సినిమా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సాహసం చేయడం లేదు.
అందుకు ముఖ్య కారణం పెద్ద సినిమాలకి ఇచ్చే టికెట్ హైక్ లు. పుష్ప2 రిలీజ్ అనంతరం మరో నెల వరకు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల జోలికి వెళ్లే దాఖలాలు కనిపించేలా లేవు. ఏకంగా 500 రూపాయల టికెట్ ధరను ఓ కుటుంబం మొత్తం భరించడం అనేది చాలా పెద్ద టాస్క్. దానికంటే పెద్ద టాస్క్.. అంత భారీ రేటు పెట్టి సినిమా చూసిన తర్వాత 15 రోజుల గ్యాప్ లో వచ్చే సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు సుముఖత చూపుతారా అనేది పెద్ద టాస్క్.
డిసెంబర్ 20 నుండి మళ్లీ రెగ్యులర్ సినిమాల వెల్లువ మొదలవుతుంది. డిసెంబర్ 20కి “సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) , బచ్చల మల్లి(Bachhala Malli), యుఐ (UI) , విడుదల-2(Viduthalai Part 2) ” వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, డిసెంబర్ 25కి “రాబిన్ హుడ్ (Robinhood) , శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Sreekakulam Sherlock Holmes) ” వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. మరి ప్రేక్షకుల దగ్గర అన్ని సినిమాలు కవర్ చేసేంత డబ్బులున్నాయా? అసలు పుష్పగాడి స్మగ్లింగ్ తర్వాత మళ్లీ ఆడియన్స్ థియేటర్ల వైపుకి రాగలరా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.
ఎందుకంటే.. ఓ నలుగురు మనుషులు ఉండే ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలంటే “పుష్ప 2” (Pushpa 2: The Rule) విషయంలో దాదాపుగా 2500 రూపాయల ఖర్చు అవుతుంది. అంత ఖర్చు చేశాక మళ్లీ అదే నెలలో మరో సినిమాకి రాగలుగుతారా? దీని ఇంపాక్ట్ 20 & 25వ తారీఖుల్లో విడుదలయ్యే సినిమాల మీద ఎంత ఉంటుంది? అనేది త్వరలోనే తెలుస్తుంది.