రాజమౌళిని పని రాక్షసుడు అని అంటుంటాడు తారక్. హీరోలు ఎండలో మలమలా మాడిపోతున్నా.. తన పర్‌ఫెక్షన్ కోసం చూస్తాడు తప్ప హీరో గురించి ఆలోచించడు అని చెబుతాడు తారక్. ఇప్పటివరకు రాజమౌళితో పని చేసిన హీరోలు అంతా ఇలాంటి వాతావరణంలోనే పని చేశారు కూడా. అయితే ఇప్పుడు రాజమౌళి చేయబోయే నెక్స్ట్ సినిమా హీరో మహేష్‌బాబు అలా కాదు. చాలా కంఫర్ట్ జోన్‌లో సినిమా షూటింగ్ చేస్తాడు అని మహేష్‌కి పేరు.
ఎండలో మాడిపోవడం, మట్టిలో దొర్లడం, ఒళ్లు హూనం చేసుకోవడం.. ఇలాంటి షాట్‌లకు వరుస రీటేక్‌లు చేయడం.. లాంటివి మహేష్‌బాబు సినిమాలో చాలా తక్కువ అని చెప్పొచ్చు. మహేష్‌బాబు గత సినిమాలు చూస్తే.. ఎంత భారీ ఫైట్ చేసినా చొక్కా నలగకుండా చూసుకుంటాడు. పెద్దగా బెండ్ అయ్యి… భీకరమైన ఫైట్ చేసిన సంద్భాలూ తక్కువే. అంతా క్లాస్‌గానే సాగిపోతుంటుంది మహేష్‌బాబు సినిమా. అయితే రాజమౌళి సినిమాలు దీనికి విరుద్ధంగా ఉంటాయి. రాజమౌళి సినిమా అంటే అంత క్లాస్ ఉండదు.
ఒకవేళ క్లాస్ సినిమా తీసినా అందులో ఆయన స్టైల్ మేనరిజమ్స్, మేజిక్స్ పెడతాడు. దీంతో హీరోకు ఒళ్లు పులిసిపోద్ది అని చెబుతారు. మొన్నీమధ్య ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రచారంలో తారక్, రామ్‌చరణ్ కూడా ఇదే మాట చెప్పారు. మరోవైపు ఎండను కూడా ఇండోర్ సెట్స్‌లో లైట్‌లు వేసి చూపించే రకం మహేష్‌బాబు సినిమా. ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మేడ మీద ‘నాయుడోరి ఇంటికాడ’ పాట ఏ మేడ మీదో తీసింది కాదు. ఇండోర్ ఫ్లోర్‌లో అలా సెట్ వేసి తీశారట. అలాంటిది ఇప్పుడు రాజమౌళి స్టైల్ యాక్షన్ సీక్వెన్స్ ఎలా అనేది ప్రశ్న.
అయితే ఇక్కడో మాట చెప్పుకోవాలి. సినిమా కథ లాక్ అయ్యాక.. దర్శకుడు చెప్పింది తూ.చ తప్పకుండా చేసుకుంటూ వెళ్లిపోవడం మహేష్‌బాబు స్టైల్. గతంలో చాలామంది దర్శకులు ఇదే చెప్పారు. సో రాజమౌళి చెప్పింది యాజ్ ఇట్ ఈజ్‌గా మహేష్ చేస్తాడు. అయితే మహేష్‌బాబు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అనేది చూసుకొని రాజమౌళి చెప్పాల్సి ఉంటుంది. అన్నట్లు తొలుత అడవి నేపథ్యంలో ఉంటుందని వార్తలొచ్చిన మహేష్ – రాజమౌళి సినిమా… ఇప్పుడు బాండ్ స్టైల్‌లో ఉంటుంది అని వార్తలొస్తున్నాయి.