అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్ 5న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడులో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే పుష్ప 2 తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సాలిడ్ బిజినెస్ సాధించింది. ఈ చిత్రానికి తమిళనాడు నుంచి 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ఇంతవరకూ టాలీవుడ్ నుంచి అక్కడ అత్యధిక బిజినెస్ చేసిన సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి.
ఇప్పటి వరకు తమిళనాడులో అత్యధికంగా వసూళ్లు సాధించిన టాలీవుడ్ సినిమాల్లో ‘బాహుబలి 2’ (Baahubali2) మొదటి స్థానంలో ఉంది, 153 కోట్ల గ్రాస్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) 80 కోట్లు, ‘బాహుబలి’ (Baahubali) మొదటి భాగం 75 కోట్ల వసూళ్లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘కల్కి 2898 ఏ.డి.’ (Kalki 2898 AD) 45.2 కోట్లు సాధించి నాల్గవ స్థానంలో నిలవగా, ‘పుష్ప 1’ (Pushpa) 30 కోట్లతో ఐదో స్థానంలో ఉంది.
‘పుష్ప 2’ తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉండే కథాంశంతో రావడం, అలాగే తమిళనాట భారీ బిజినెస్ సాధించడంతో ఈ చిత్రం టాప్ 5లోకి చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ సినిమా తక్కువలో తక్కువ 80-90 కోట్ల గ్రాస్ అందుకుంటేనే ‘ఆర్ఆర్ఆర్’ను దాటే అవకాశం ఉంటుంది. ‘పుష్ప 2’పై తారాస్థాయిలో అంచనాలు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకునే అవకాశం పుష్కలంగా ఉంది.
అలాగే, తమిళనాడులో అల్లు అర్జున్‌కు (Allu Arjun) ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమా ప్రత్యేక స్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. అయితే తమిళ ఆడియెన్స్ ను మెప్పించడం అంత ఈజీ కాదు. మన హీరోల సినిమాలు కంటెంట్ క్లిక్కయితేనే పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుంది. ఇక సుకుమార్ (Sukumar) పనితనంపై నమ్మకంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగానే ఆసక్తి చూపారు. మరి సినిమా ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందో చూడాలి.