ఒక్కోసారి హాలీడే సీజన్ కూడా సినిమా రిలీజ్ కి పెద్ద టెన్షన్ లా మారుతుంది. సంక్రాంతి సెలవులు 5వ తారీఖు నుండి మొదలవుతున్నా.. అల్లు అర్జున్, మహేష్ బాబులు జనవరి 12 కోసమే పోటీ పడుతున్నారు. విడుదల తేదీలో తర్వాత మార్పులు సహజం అయినప్పటికీ.. ఇద్దరు ప్రస్తుతం ఒకే రోజు విడుదల కోసం తంటాలు పడుతున్నారు. ఒక రెండు రోజులు ముందు.. అనగా జనవరి 10, శుక్రవారం మాత్రం తమ సినిమాను విడుదల చేయడానికి ఎవరూ సుముఖత చూపడం లేదు. అందుకు కారణం 5వ తారీఖు నుండి, 10 వరకూ జనాలందరూ పండగ హడావుడిలో బిజీగా ఉంటారు. ఆ సమయంలో ఎంత పెద్ద సినిమా అయినా కుటుంబ సమేతంగా చూడడానికి ఇష్టపడరు. అందుకే.. ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన “సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో” ఆ తేదీల్లో విడులవ్వడానికి ఇష్టపడడం లేదు.
అయితే.. రజనీకాంత్ దర్బార్ చిత్రాన్ని ఆ తేదీకి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అనువాద సినిమా కాబట్టి పర్వాలేదు అనుకొంటున్నారు కానీ.. కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రావు అనేది ట్రేడ్ పండిట్స్ విశ్లేషణ. సినిమా బాగుంది అని జనాలకు తెలిసి, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేసరికి.. మేజర్ థియేటర్స్ లో “దర్బార్”ను తీసేసి “సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో” సినిమాలు వేసేస్తారు. ఏ రకంగా చూసుకున్నా రజనీ చేసేది రిస్కే. మరి మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకొంటారో చూడాలి.