బిగ్‌బాస్ హోస్టులు అంటే న్యూట్రల్‌గా ఉంటారు అని అంటుంటారు. బిగ్‌బాస్ టీమ్ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ల ఆలోచనలు ఉంటాయి తప్ప మరేం కావు. మరోవైపు హోస్టుల సోషల్ ఇమేజ్ కూడా ముఖ్యంగా పరిశీలిస్తుంటారు. కాంట్రవర్శీలు లేని స్టార్ హీరోలను హోస్ట్‌లుగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. మరి ఇంత ఆలోచన చేసే బిగ్‌బాస్ టీమ్ తమిళంలో వాటికి మించి హోస్టును ఎంపిక చేస్తుందా? తెరపైకి వస్తున్న కొత్త పేరు వింటుంటే అలానే అనిపిస్తోంది. అయితే ఇదంతా తమిళ బిగ్‌బాస్ కోసం.
తమిళ బిగ్‌బాస్‌కు నాలుగు సీజన్లగా కమల్ హాసన్ హోస్ట్‌గా చేస్తున్నారు. అయితే త్వరలో ప్రారంభం కాబోయే ఐదో సీజన్‌కి కొత్త హోస్ట్‌ను తీసుకొచ్చే ఆలోచన ఉందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఇప్పుడీ మాటలే తమిళ టీవీ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. కారణం కమల్ బదులు వచ్చేది శింబు అని సమాచారం. కమల్‌కు దీటుగా శింబు రాణిస్తాడా అనేది వేరే ప్రశ్న. ఎందుకంటే ఎవరి స్టయిల్ వారిది. కానీ పెద్దగా ట్రెండింగ్‌లో లేని, ఫామ్‌లో లేని హీరోను తీసుకుంటారా? అనేది ఓ ప్రశ్న. రెండోది శింబు మీద కొన్ని కాంట్రవర్శీలు ఉన్నాయి. ఇవే అడ్డుపడతాయని ఓ వర్గం వాదన. మరి ఈ విషయంలో బిగ్‌బాస్ టీమ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి.
కమల్ ఎందుకు బిగ్‌బాస్ నుండి తప్పుకుంటారు అనే ప్రశ్నకు చాలా సమాధానాలు వస్తున్నాయి. ఒకటి ఆయన ఆరోగ్యం అయితే, రెండోది ఆయన రాజకీయ ప్రవేశం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి షో చేస్తే ఇబ్బందులు వస్తాయేమో అనే ఆలోచన కమల్‌కి వచ్చిందని అంటున్నారు. మరోవైపు నాలుగో సీజన్‌లో కొన్ని ఎపిసోడ్స్‌లో కుర్చీలో కూర్చొని హోస్ట్ చేశాడు. అంతసేపు నిలబడటం కష్టం కావడమే కారణం. అయితే ఆర్థిక సమస్యల కారణంగానే కమల్ ఆ షో చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. మరిప్పుడు ఆ సమస్యలు తీరిపోయాయా అంటే కమల్‌హాసనే చెప్పాలి.