సోనీ లైవ్ లో స్ట్రీమ్ అవుతున్న తాజా తమిళ చిత్రం “విట్నెస్”. పారిశుధ్య కార్మికుల చేత బలవంతంగా చేయిస్తున్న సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వల్ల జరుగుతున్న ప్రాణ హాని కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!
కథ: చెన్నైలో రోడ్లు ఉడ్చే పారిశుధ్య కార్మికురాలు ఇంద్రాణి (రోహిణి), భర్త లేకపోయినా కొడుకు పార్తిబన్ ని చదివించుకుంటూ సంతోషంగా జీవిస్తుంటుంది. అయితే.. బలవంతంగా పార్తిబన్ ను సెప్టిక్ ట్యాంక్ లోకి దింపి.. అతడి మరణానికి కారణమవుతారు కొందరు అధికారులు, వ్యక్తులు. సదరు ప్రభుత్వ మరియు ప్రయివేట్ అధికారులు, అలాగే.. సంఘంలో పరపతి కలిగిన పెద్దల మీద ఇంద్రాణి ఒంటరి పోరాటమే “విట్నెస్” కథాంశం.
నటీనటుల పనితీరు: రోహిణి ఓ నడిచే నట విశ్వవిద్యాలయం. ఒక సన్నివేశానికి, ఒక సందర్భానికి, ఒక ఎమోషన్ కు ఎంత వరకూ అవసరమో అంత వరమే ఎమోట్ చేయగలగడం అనేది సహజసిద్ధంగా రావాలి. అందులో రోహిణి స్పెషలిస్ట్ అనే విషయాన్ని కొత్తగా చెప్పక్కర్లేదు. ఇంద్రాణి పాత్రలో ఆమె జీవించిన తీరు ప్రస్తుత తరం నటీమణులకు ఒక పాఠ్యాంశం.
సహాయ పాత్రలో నటించిన శ్రద్ధ శ్రీనాధ్ కూడా రోహిణి స్థాయిలో నటించడానికి పడిన తపన ప్రశంసనీయం. పార్తిబన్ గా నటించిన కుర్రాడి ముఖంలో కనపడే ప్రశాంతత, నిజాయితీ సినిమాకి యాడ్ చేసే వేల్యూ ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దీపక్.. ఈ సినిమా కోసం చేసిన రీసర్చ్ & పారిశుధ్య కార్మికుల జీవితాల గురించి వివరించిన విధానం ఆలోచింపజేస్తుంది. అలాగే.. ఒక సాధారణ పౌరుడిగా మనం పట్టించుకోకుండా వదిలేయడం వల్ల సమాజంలో జరిగే అన్యాయాలను ఎత్తి చూపిన తీరు కూడా బాగుంది. మనిషిని మనిషిగా చూడలేని సమాజం, ప్రభుత్వం మానవాళికి ఎంతటి చేటు కలిగిస్తుంది అనేది ఒక సినిమాగా వివరించిన తీరు, ముఖ్యంగా క్లైమాక్స్ ను కంపోజ్ చేసిన విధానం సమాజపు పద్ధతులను ప్రశ్నించేలా చేస్తుంది.
ఈమధ్యకాలంలో చూసిన ఒన్నాఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ “విట్నెస్” చిత్రం అని చెప్పొచ్చు. అలాగే.. ఒంటరి మహిళలు, ముఖ్యంగా ఎవరికీ తలవంచని మహిళలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలను కూడా చాలా సహజంగా ఎలాంటి అతి లేకుండా చిత్రించిన విధానం అందరికీ కనెక్ట్ అవుతుంది. అలాగే.. ఆడవాళ్ళ మెంటల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని ప్రస్తావించిన తీరు కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం, ఎడిటింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరిన చిత్రమిది.
విశ్లేషణ: మానసిక సంతృప్తి కలిగించే సినిమాలు, ఆనందాన్ని కలిగించే సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కానీ.. మనలోని మనిషిని, సమాజంలోని తప్పులని, ప్రభుత్వ పద్ధతులను ప్రశ్నించే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటి అరుదైన చిత్రమే “విట్నెస్”. సినిమాలో ప్రస్తావించిన విషయాల గురించి మాత్రమే కాక.. చివర్లో ఇచ్చిన టైటిల్ జస్టిఫికేషన్ కోసం “విట్నెస్”ను కచ్చితంగా చూడండి.
రేటింగ్: 3/5
Rating
3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus