ప్రముఖ రచయిత ఆకెళ్ళ వెంకట సూర్య నారాయణ అలియాస్ ఆకెళ్ళ గారు మృతి చెందారు. ఆయన వయసు 75 ఏళ్ళు అని తెలుస్తుంది. ఈ సెప్టెంబర్ 18న అనగా గురువారం నాడే ఆయన మృతి చెందడం జరిగింది. అయితే ఈ వార్త కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు విదేశాల నుండి రావడానికి సమయం పడుతుండటం వంటి కొన్ని కారణాల వల్ల సూర్య నారాయణ భౌతిక కాయాన్ని ఆయన నివాసంలోనే ఉంచారట.
ఈరోజు అనగా సెప్టెంబర్ 20న ఉదయం 10:30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సమాచారం.ఆకెళ్ళ వెంకట సూర్య నారాయణ చిన్నప్పటి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తి కారణంగా.. నాటక రంగంలోకి అడుగుపెట్టారు.ఆయన సొంత ఊరు తూర్పుగోదావరి జిల్లాకి చెందిన కాకినాడ.ఎన్నో నాటకాలకు రచయితగా పనిచేసిన అనంతరం.. నవలా రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఆయనకు సినిమాల్లో కూడా అవకాశాలు లభించాయి.
సూర్య నారాయణ సినీ కెరీర్ ను గమనిస్తే.. ‘మగమహారాజు’ ‘స్వాతి ముత్యం’ ‘శృతి లయలు’ ‘ఆడదే ఆధారం’ ‘సిరివెన్నెల’ ‘శ్రీమతి ఒక బహుమతి’ ‘నాగ దేవత’ ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ‘ఓ భార్య కథ’ ‘ఆయనకి ఇద్దరు’ ‘చిలకపచ్చ కాపురం’ ‘ఔనన్నా కాదన్నా’ ‘ఎంత బావుందో!’ వంటి సినిమాలకు ఆయన రైటర్ గా పనిచేశారు. ‘అయ్యయ్యో బ్రహ్మయ్య’ సినిమాకి ఆయన దర్శకత్వం వహించడం కూడా జరిగింది. అయితే ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అందువల్ల మరో దర్శకుడిగా మరో సినిమాకి పనిచేసే అవకాశం ఈయనకు దక్కలేదు.