ఒక దర్శకుడి కంటే కథ రాసుకొన్న రచయితకే సినిమా మీద ఎక్కువ పట్టు ఉంటుంది. అందుకే.. చిత్రీకరణ సమయంలో దర్శకుడు తప్పకుండా రచయితను వెంట పెట్టుకొంటాడు. అందుకే.. తర్వాత కాలంలో రచయితలు కూడా దర్శకులుగా మారడం మొదలెట్టారు. ప్రస్తుతం ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి వాళ్ళు రచయితలుగా కెరీర్ ను మొదలెట్టి దర్శకులుగా మారినవాళ్లే. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొనే ఇప్పటికీ కొందరు రచయితలు దర్శకులుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు.
అయితే.. దర్శకులుగా మారే ప్రతి దర్శకుడు త్రివిక్రమ్, కొరటాల తరహాలో విజయాన్ని అందుకోవడం కష్టమే. అందుకు నిదర్శనం బి.బి.ఎస్.రవి, డార్లింగ్ స్వామి, వక్కంతం వంశీ. వీళ్ళందరూ రైటర్స్ గా సక్సెస్ ఫుల్ జోన్ లో ఉండి.. దర్శకులుగా మారి ఫ్లాపులు అందుకొన్నారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరాడు డైమెండ్ రత్నబాబు. రైటర్ గా పర్వాలేదు అనిపించుకొంటున్న రత్నంబాబు.. “బుర్ర కథ” సినిమాతో దర్శకుడిగా మారాడు. నిన్న విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. అసలే హీరోగా తన ఉనికిని కాపాడుకోవాలని నానా పాట్లు పడుతున్న ఆదికి ఈ చిత్రం మరో మైనస్ పాయింట్ గా మారింది.