“బిచ్చగాడు”తో భీభత్సమైన పాపులారిటీ దక్కించుకొన్న మ్యూజిక్ డైరెక్టర్ టర్నడ్ హీరో విజయ్ ఆంటోనీ అనంతరం “భేతాళుడు”తో మరో ప్రయోగాత్మక చిత్రంతో ఆకట్టుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో ప్రయోగానికి కాస్త దూరంగా జరిగి పోలిటికల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం “యమన్”. మలయాళ ముద్దుగుమ్మ మియా జార్జ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ : దేవరకొండ అశోక్ చక్రవర్తి (విజయ్ ఆంటోనీ) చిన్నప్పుడే తల్లిదండ్రులను వేర్వేరు కారణాల వల్ల పోగొట్టుకొని తాతయ్యతో కలిసి సాధారణ జీవితం వెళ్లదీస్తుంటాడు. తాతయ్య ఆరోగ్యం క్షీణించి అర్జెంట్ గా ఆపరేషన్ చేయించాల్సి రావడంతో.. ఆపరేషన్ కోసం కావాల్సిన 3 లక్షల రూపాయల కోసం వేరే దారి లేక ఒక యాక్సిడెంట్ కేసును తనపై వేసుకొని జైలుకి వెళ్తాడు. ఏదో చిన్న శిక్షతో ముగుస్తుందనుకొన్న జైలు జీవితం అశోక్ జీవితంలో అనూహ్య మార్పులను తీసుకువస్తుంది. జైల్లో రాజకీయాల గురించి తెలుసుకొంటాడు. తాను వ్యక్తిగా ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకొన్న అశోక్ జీవితం ఎటువంటి మలుపులు తిరిగింది? వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు అనేది “యమన్” చిత్ర కథాంశం.
నటీనటుల పనితీరు : బాడీ లాంగ్వేజ్ పరంగా సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తున్న విజయ్ ఆంటోనీ హావభావాల ప్రకటనలో మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాడు. ఒక్క కోపం తప్పితే ఏ ఇతర ఎమోషన్ ను సరిగా ఎలివేట్ చేయలేకపోతున్నాడు. తదుపరి చిత్రంలోనైనా దాన్ని అధిగమిస్తాడని ఆశిద్దాం. రీల్ లైఫ్ లోనూ హీరోయిన్ గా మలయాళ ముద్దుగుమ్మ మియా జార్జ్ అందంగా కనిపించడంతోపాటు నటనతోనూ ఆకట్టుకొంది. రాజకీయ చాణక్యుడిగా త్యాగరాజన్ చాలా రోజుల తర్వాత వెండితెరపై కనిపించి అలరించారు. ఆయన స్క్రీన్ ప్రెజన్స్ కథలో పెద్ద ఇంపాక్ట్ తీసుకురాలేకపోయిన ప్రేక్షకుడిని కాస్త అలరించింది. మిగతా తమిళ నటీనటులందరూ తమ తమ పాత్రలకు బాడీ లాంగ్వేజ్ మొదలుకొని వేషధారణ వరకూ ప్రతి విషయంలోనూ పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : చిత్ర కథానాయకుడైన విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా కావడం గమనార్హం. మరీ ఎక్కువగా కొరియన్, జపనీస్ చిత్రాలు చూసిన ఎఫెక్ట్ పడిందో ఏమో తెలియదు కానీ.. రోమాంటిక్ నెంబర్స్ కు కూడా టిపికల్ థీమ్ మ్యూజిక్ తో చిరాకు తెప్పించాడు. తెరపై హీరోహీరోయిన్లు రొమాన్స్ చేస్తుండగా.. చెవులకు మాత్రం వాళ్ళేదో ఎత్తుకు పైఎత్తు వేయడానికి సన్నద్ధమవుతున్న శత్రువుల్లా వినిపిస్తుంటారు.
ఈ చిత్రానికి కథ-కథనం-దర్శకత్వం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తించిన జీవా శంకర్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు కూడా కావడం విశేషం. అయితే.. స్వతహా మంచి కెమెరామెన్ అయిన జీవా శంకర్ తనకు బాగా తెలిసిన సినిమాటోగ్రఫీ మీదే ఎక్కువగా శ్రద్ధ చూపి కథ-కథనం వంటి విషయాలకు పూర్తిగా పక్కన పెట్టేశాడు. హీరోకు విలన్ కారణంగా జరిగిన నష్టాన్ని చివరివరకూ హీరోకి తెలియనివ్వకుండా చేసి ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి పోలిటికల్ డ్రామాగా మలిచిన తీరు బాగున్నప్పటికీ.. “మొగలిరేకులు” సీరియల్ కంటే ఎక్కువగా సాగదీయబడిన స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించకమానదు. సో, డైరెక్టర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా జీవా శంకర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు.
విశ్లేషణ : విజయ్ ఆంటోనీ సినిమాలంటే వైవిధ్యం ఉంటుందని ఆశపడి థియేటర్లకు వెళ్ళే ప్రేక్షకుడికి తీవ్రమైన నిరాశ కలిగించే చిత్రం “యమన్”. పోలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కథ బాగానే ఉన్నప్పటికీ.. నత్త నడక కంటే స్లోగా సాగే కథనం కారణంగా ప్రేక్షకుల్ని అలరించలేక చతికిలపడింది!