కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో యశ్ ఒకరు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ కావడంతో పాటు యశ్ కు మంచి పేరును, ఇతర భాషల్లో గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ఏడాది జులై 16వ తేదీన కేజీఎఫ్ ఛాప్టర్ 2 విడుదల కానుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే ఒక వివాదం వల్ల యశ్ పరువు పోవడంతో పాటు నెటిజన్ల నుంచి యశ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కర్ణాటకలోని హాసన్ జిల్లా తిమ్మాపుర గ్రామస్తులకు, యశ్ తల్లికి మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ గ్రామంలో యశ్ కుటుంబం 80 ఎకరాల భూమిని కొనుగోలు చేసి రైతులు పొలాలకు వెళ్లకుండా దారిని మూసివేసింది. వివాదం పెద్దది కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పారు.
అయితే హీరో యశ్ గ్రామంలోకి రౌడీలను పంపి భయపెడుతున్నారని గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. రాజ్య రైతు సంఘం కార్యాధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్ హీరో యశ్ పై హాసన్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. యశ్ అక్రమంగా ప్రహరీని నిర్మించి గ్రామంలోని రైతులను ఇబ్బంది పెడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. యశ్ తల్లి హాసన్ జిల్లాకు చెందినవారు కాగా హాసన్ లో ఆమెకు సొంత ఇల్లు కూడా ఉంది.
ఆ కారణం వల్లే హాసన్ కు దగ్గరలో ఉన్న తిమ్మాపూర్ గ్రామంలో యశ్ 80 ఎకరాల పొలం కొనుగోలు చేశారు. అయితే పాన్ ఇండియా స్టార్ అయిన యశ్ రైతులతో గొడవ పడుతూ ఉండటంతో యశ్ ఇమేజ్ పై వ్యతిరేకత వస్తోంది. రీల్ లైఫ్ లో హీరో అయిన యశ్ రియల్ లైఫ్ లో విలన్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.