Yash: ‘టాక్సిక్’ తర్వాత యశ్ రిస్క్ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…
- October 14, 2026 / 06:44 PM ISTByFilmy Focus Desk
‘కేజీయఫ్’ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని యశ్ చేసిన సినిమా ‘టాక్సిక్’. ఈ సినిమా మీద తొలుత భారీ అంచనాలు ఉన్నా.. టీజర్, ట్రైలర్ వచ్చాక చాలా విమర్శలు వచ్చాయి. సినిమా వచ్చాక ఆ విమర్శలు జడివానలా చుట్టుముట్టాయి. సినిమాను ఓ చుట్టు చుట్టేసి పక్కన పెట్టేసేలా చేశాయి. ఆ సినిమా వచ్చిన వెంటనే శాండిల్ వుడ్ అగ్ర నటులు దాదాపు యశ్‌కి సపోర్టుగా నిలబడ్డారు. అయితే ప్రేక్షకులు ఆ సినిమాకు మద్దతు ఇవ్వలేదు.
Yash
దీంతో ఈ సినిమాకు డిజాస్టర్ టాక్, రిపోర్టు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంత త్వరగా సినిమా చేయకపోవచ్చు అనే అంచనాలు మొదలయ్యాయి. కానీ ఆయన ఆలోచనలు చూస్తుంటే.. ఆ సినిమా ఫలితం ఎఫెక్ట్ అస్సలు లేనట్లుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన వింటున్న సినిమా కథలు, ఓకే చేశాడు అంటున్న సినిమా కథ అలా ఉంది మరి. ‘సర్దార్’ సినిమాల దర్శకుడు పీఎస్ మిత్రన్ కొన్ని రోజుల క్రితం యశ్‌కి ఓ కథ చెప్పారట. దానిని ఇప్పుడు పట్టాలెక్కిస్తారని సమాచారం.

ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్లో మిత్రన్ దగ్గర ఓ కథ ఉంది. అది ఆయన డ్రీం ప్రాజెక్టు కూడా. ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ ‘ఇండియానా జోన్స్’ తరహాలో ఉంటుంది అని చెబుతున్నారు. ఆ సినిమా స్ఫూర్తిగానే మిత్రన్ తన కథను అల్లుకున్నారట. స్టార్ హీరో అవసరమయ్యే ఈ సినిమాకు బడ్జెట్ రూ.వందల కోట్లలోనే ఉంటుందని చెబుతున్నారు. అందుకే యశ్ని హీరోగా అనుకున్నారట. ఈ సినిమా బాలీవుడ్, కోలీవుడ్ నిర్మాణ సంస్థలు కలసి రూపొందించే అవకాశం ఉందట.
అన్నట్లు మహేష్‌బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాకు ఈ సినిమాకు దగ్గర సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా కథకు కూడా ‘ఇండియానా జోన్స్’ సినిమానే స్ఫూర్తి. కాబట్టి రాజమౌళి చేస్తున్న సినిమా తరహాలోనే మిత్రన్ కథ ఉంటుంది. ఇటీవల మిత్రన్ చేసిన ‘సర్దార్ 2’ సినిమా విషయంలోనే ఇలాంటి విమర్శలు వచ్చాయి. ‘ధురంధర్ 2’ సినిమా కథను ఆ సినిమా పోలి ఉందనేది అప్పుడు వచ్చిన మాట.












