టీజర్ & ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం “ఏడు చేపల కథ”. పూర్తి స్థాయి అడల్ట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి ఈ అడల్ట్ కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేశారా లేదా అనేది చూద్దాం..!!
కథ: టెంప్ట్ రవి (అభిషేక్ రెడ్డి) ఓ సాధారణ యువకుడు. తలస్సేమియా (రక్తానికి సంబంధించిన వ్యాధి)తో బాధపడుతుంటాడు. అతడు ఆరోగ్యంగా జీవించాలంటే నెలకి ఒకసారి కొత్త రక్తం ట్రాన్స్ ఫర్ చేయించుకోవాలి. రవి & ఫ్రెండ్స్ అందరూ ఇదే సమస్యతో బాధపడుతుంటారు. రవికి ఈ రక్త సంబంధిత వ్యాధితోపాటు మరో జబ్బు కూడా ఉంటుంది. అదే ఎవర్ని చూసినా టెంప్ట్ అయిపోవడం. ఆడదాని జడ చూసినా టెంప్ట్ అయిపోతాడు రవి. అలాంటి రవి ఒక ఏడుగుర్ని చూసి టెంప్ట్ అవడం, ఆ ఏడుగురు రవితో శృంగార భూమిలో మారణఖాండలు చేయడం జరిగిపోతాయి. అయితే.. అది కలా, నిజమా అనే విషయంలో రవికి క్లారిటీ ఉండదు.
అసలు ఆ ఏడుగురు ఎవరు? నిజంగానే రవితో శృంగారం చేశారా? ఒకవేళ నిజమైతే ఎందుకు? అనేది “ఏడు చేపల కథ” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు: టెంప్ట్ రవి పాత్రలో అభిషేక్ సహజమైన నటనతో ఆకట్టుకొన్నాడు కానీ.. అతడి చేత చెప్పించిన బూతు మాటలు, చేయించిన పనులు చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఇక ఏడు చేపలుగా నటించిన ఏడుగురు ఎక్స్ పోజింగ్ విషయంలో అస్సలు మొహమాటపడలేదు. అలాగే వాళ్ళు నటించి-జీవించిన సీన్స్ ను సెన్సార్ వాళ్ళు కనికరించకుండా కట్ చేయడంతో.. వాళ్ళ కష్టం మొత్తం కటింగ్ కి పరిమితమైపోయిందనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు తాను తీసిన “ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి” అనే సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి ఇలాంటి సినిమా తీశాను అని చెప్పుకొచ్చాడు. సినిమా హిట్ అవ్వకపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో.. హిట్ అవ్వడానికి కూడా అన్నే కారణాలు ఉంటాయి. “గుంటూరు టాకీస్” లాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా హిట్ అయ్యిందంటే.. ఆకట్టుకొనే కథతోపాటు అలరించే కథాంశం కూడా ఉండాలి. ఈ విషయాన్ని గాలికొదిలేసిన దర్శకుడు కేవలం శృంగార సన్నివేశాల మీద మాత్రమే కాన్సన్ ట్రేట్ చేసి కథను గాలికొదిలేశాడు. అసలు ప్రేక్షకులు కోరుకొని వచ్చిన శృంగార సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు బలవ్వడంతో.. వాళ్ళంతా బిట్స్ లేవని బాధపడుతుంటే.. కథ ఏమిటో అర్ధం కాక, కథనం ఎటువైపు వెళుతుందో తెలియక తికమకపడుతూ.. అసహనానికి లోనవుతాడు సగటు ప్రేక్షకుడు. అడల్ట్ కంటెంట్ తో సినిమా తీయడం తప్పేమీ కాదు.. బూతు సినిమాలు బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన సందర్భాలు కోకొల్లలు. ప్రేక్షకులకు టీజర్లు, ట్రైలర్లతో కొన్ని శృంగార సన్నివేశాలను ఆశజూపి.. థియేటర్లకు వచ్చిన వాళ్లందర్నీ నిరాశపరచడం తప్ప ఈ “ఏడు చేపల కథ” సాధించింది ఏమీ లేదు.
సంగీతం, కెమెరాపనితనం, ప్రొడక్షన్ డిజైన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
విశ్లేషణ: కథ, కథనం లాంటిది పట్టించుకోకుండా రెండు గంటల పాటు ఏదో ఉందని ఎదురుచూస్తూ.. చివరికి ఏదీ లేదని నిరాశతో థియేటర్ నుండి వెనుదిరిగే ఓపిక, సత్తువ ఉంటేనే చూడాల్సిన సినిమా “ఏడు చేపల కథ”.
రేటింగ్: 1/5