ఇప్పుడంటే రామ్ (Ram) సరైన విజయం కోసం కష్టపడుతున్నాడు కానీ.. ఒకప్పుడు తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు.. ఈ మాట మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ‘దేవదాసు’ (Devadasu) సినిమా వసూళ్ల సంగతి గురించి తెలిసినవాళ్లు ఎవరైనా ఇలానే అనుకుంటారు. అనుకోవాలి కూడా. అయితే ఆ రికార్డు వసూళ్లు వెనుక, వైవీఎస్ చౌదరి (Y. V. S. Chowdary) నానా కష్టాలు పడ్డారని మీకు తెలుసా? చాలామందికి తెలియని, అతి కొద్దిమందికి తెలిసిన విషయాన్ని ఇటీవల వైవీఎస్ చౌదరి ఓ ప్రెస్ మీట్‌లో చెప్పారు.
రామ్‌కు ఎనర్జిక్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చిన సినిమా ‘దేవదాసు’. ఆ మాటకొస్తే తొలి సినిమా కూడా అదే. 17 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడింది ఈ సినిమా. మామూలుగా అయితే ఇంత భారీ విజయం అందుకుంది అంటే తొలి రోజు నుండే రికార్డు వసూళ్లు వచ్చాయి అనుకుంటారు. కానీ ఇక్కడ కథ వేరు. ఈ సినిమాకు మొదటి ఆట నుండే విపరీతమైన పాజిటివ్ టాక్ రాలేదు. ఇక వసూళ్ల సంగతి సరేసరి. థియేటర్ల సంగతి ఇంకా సరేసరి. ఇంతకీ ఏమైందంటే…
‘దేవదాసు’ సినిమా 2006 సంక్రాంతి కానుకగా జనవరి 11 విడుదలైంది. రూ.పది కోట్లకు పైగా బడ్జెట్, కొత్త హీరో, పెద్ద హీరోల సినిమాలు చుట్టూ ఉన్న సీజన్. ఆ సమయంలో వచ్చిందీ ‘దేవదాసు’. లారెన్స్ (Lawrence) హీరోగా చిరంజీవి (Chiranjeevi) , నాగార్జున (Nagarjuna) అతిథి పాత్రలు చేసిన ‘స్టైల్’ ఒక పక్క, అప్పుడు కుర్రకారు కలవరించే సిద్దార్థ్ (Siddharth) ‘చుక్కల్లో చంద్రుడు’ (Chukkallo Chandrudu) మరో పక్క ఉన్నాయి. ఫ్యామిలీ హీరో వెంకటేష్ (Venkatesh) ‘లక్ష్మి’ (Lakshmi) కూడా ఉంది. దీంతో ‘దేవదాసు’ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
అయితే తన సినిమా మీద నమ్మకం పెట్టుకున్న వైవీఎస్ చౌదరి.. పట్టు వదలకుండా థియేటర్లకు వెళ్లి జనం ఉన్నా లేకపోయినా ప్రమోషన్లు చేశారు. నాలుగు వారాలు అతికష్టం మీద పూర్తయ్యాక.. అప్పుడు ‘దేవదాసు’ టైమ్ స్టార్ట్ అయింది. హౌస్ ఫుల్స్ బోర్డులు థియేటర్ల ముందు వెలిశాయి. అలా వంద రోజులు దాటినా పరుగు ఆగలేదు. ఇప్పుడు ఆ సినిమా చరిత్రగా మారింది.