తెలుగు వారు కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సినిమా మహానటి. తెలుగు చిత్ర పరిశ్రమ తొలినాళ్లలోనే నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా నిరూపించుకున్న సావిత్రి జీవితం పై తెరకెక్కిన మూవీ ఇది. మే 9 న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో ఆకర్షించే అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో టాప్ టెన్ అందిస్తున్నాం.
1 . సావిత్రి జీవితంతెలుగు వారికి పరిచయం చేయనవసరం లేని పేరు సావిత్రి. చక్కని అభినయంతో ఆమె తెలుగుజాతి గర్వించే నటి అయ్యారు. నేటి తరం హీరోయిన్లకు ఆమె చిత్రాలు రిఫరెన్స్ గా మారాయి. అటువంటి అభినేత్రి నిజ జీవితంలోని మధుర ఘట్టాలను, అభిమానులకు తెలియని విషయాలు ఇందులో పొందుపరిచారు. అవి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఉన్నారు.
2 . కీర్తి సురేష్ నటన తెలుగు, తమిళంలో తక్కువ చిత్రాలతో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి సురేష్ గా చక్కగా సూటయిపోయిందని మహానటిలో ఆమె స్టిల్స్ స్పష్టం చేశాయి. వెండితెరపై నటన పరంగాను సావిత్రిని గుర్తుకు తెస్తారనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
3 . దుల్కర్ సల్మాన్మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ “హే పిల్లగాడా” సినిమా ద్వారా తెలుగు వారికీ పరిచయమయ్యారు. అతను ఈ చిత్రంలో సావిత్రి భర్త జెమిని గణేష్ రోల్ పోషించారు.
4 . సమంత & విజయ్ దేవరకొండ యువతలో మంచి క్రేజ్ ఉన్న నటీనటుల్లో సమంత, విజయ్ దేవరకొండ ముందు వరుసలో ఉన్నారు. వీరి గత చిత్రాలు రంగస్థలం, అర్జున్ రెడ్డి ఘన విజయం సాధించడంతో ఈ జంటను కలిసి చూడాలని కోరుకుంటున్నారు. తొలిసారి కలిసి జర్నలిస్టులుగా నటించిన వీరు తప్పకుండా మెప్పిస్తారు.
5 . భారీ తారాగణం కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత & విజయ్ దేవరకొండ తదితరులు మాత్రమే కాదు.. ఇందులో అనేకమంది నటించారు. ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్, కెవి రెడ్డిగా క్రిష్, ఏఎన్నార్ గా నాగచైతన్య, సుశీలగా షాలినీ పాండే, ఎస్వీ రంగారావుగా ప్రకాష్ రాజ్, మరికొన్ని కీలకపాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ, మాళవిక తదితరులు కనిపించనున్నారు. వీరందరూ చిత్రానికి మరింత బలం కానున్నారు.
6 . నాగ్ అశ్విన్“ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రంగా కాకుండా ఆలోచింపజేసేలా తెరకెక్కించారు. ఇక సావిత్రికి వీరాభిమాని అయిన నాగ్ అశ్విన్ ఆమె జీవితాన్ని మనసుకు హత్తుకునేలా వెండితెరపై ఆవిష్కరించి ఉంటారని అందరూ భావిస్తున్నారు.
7 . లేడీ ప్రొడ్యూసర్స్ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ లు చిన్నప్పటి నుంచి బుల్లితెర, వెండితెర ప్రపంచంగా బతికారు. అలాగే ఈ సినిమాని వారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తండ్రికి తగ్గ తనయులుగా నిరూపించుకోబోతున్నారు.
8 . హృదయాన్ని తాకే మాటలు గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 సినిమాలకు మాటలు అందించి సాయి మాధవ్ బుర్ర అభినందనలు అందుకున్నారు. ఇప్పుడు సైరా, ఎన్టీఆర్ బయోపిక్ కి డైలాగులు అందించారు. అటువంటి రచయిత కలం నుంచి మహానటి కోసం మంచి, మరుపురాని మాటలు వచ్చి ఉంటాయని అందరూ విశ్వసిస్తున్నారు.
9 . సంగీతమే ప్రాణం మహానటి కోసం మిక్కి జే మేయర్ ఇచ్చిన ట్యూన్స్ తెలుగు, తమిళ సంగీత ప్రియుల మనసులను గెలుచుకుంది. అలాగే తన నేపథ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోయనున్నారు.
10 . అమోఘమైన సెట్స్ సావిత్రి నటించిన పౌరాణిక, సాంఘిక సినిమాలు అపూర్వ విజయం సాధించాయి. అందులోని సెట్స్ లను మళ్ళీ పునః ప్రతిష్టించారు. చిన్న సీన్ కోసం కూడా సెట్ వేశారు. ఈ చిత్రానికి 32 భారీ సెట్స్ నిర్మించినట్లు నిర్మాతలు ప్రకటించారు.
రెండేళ్ల పరిశోధన, వందలమంది ఏడాది కృషి, ప్రముఖ ఆర్టిస్టుల శ్రమ, భారీ వ్యయం కలిస్తే మహానటి. రిలీజ్ అయిన తర్వాత మహా అద్భుతమని ప్రతి ఒక్కరూ అనాల్సిందే.