కరోనా & లాక్ డౌన్ తర్వాత అసలు థియేటర్లు అప్పుడే తెరుస్తారనే కనీసం ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే వైరస్ వ్యాపించడానికి అన్ని రకాలుగా సహకరించే ఏకైక స్థలం సినిమా థియేటర్. అందుకే విడతలుగా విరమించిన లాక్ డౌన్ లో థియేటర్లను ఆఖరిగా ఓపెన్ చేశారు. అది కూడా కేవలం 50% ఆక్యుపెన్సీతో. ఆ సగం ఆక్యుపెన్సీ థియేటర్లు కూడా ఫుల్ అవ్వలేదు. మొన్న విడుదలైన “సోలో బ్రతుకే సో బెటర్” కాస్త జనాల్ని థియేటర్లు రప్పించడానికి ప్రయత్నించినప్పటికీ..
పెద్ద ఫలితం మాత్రం దక్కలేదు. మరో వారంలో సంక్రాంతి మొదలుకానుండడంతో పెద్ద సినిమాలన్నీ ఓటీటీలను తప్పించుకొని థియేటర్ల బాట పట్టాయి. ఈ క్రమంలో విజయ్ “మాస్టర్” సినిమాకు తమిళనాడులో 100% అక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వడం సంచలనం సృష్టించింది. ఎంత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసినా ఇప్పుడు థియేటర్లలో జనాలు కిక్కిరిస్తే మళ్ళీ.. వైరస్ ప్రభలడమే అవుతుందని డాక్టర్లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి కూడా తెలుగు రాష్ట్రాల్లో 100% ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వమని కోరడం చర్చనీయాంశం అయ్యింది.
అయితే.. తమిళనాట విజయ్ స్వయానా ముఖ్యమంత్రిని కలిసి రిక్వెస్ట్ చేసాడు కాబట్టి అక్కడ పర్మిషన్ వచ్చింది. తెలుగులో అలా అడగడానికి పెద్ద స్టార్లు ముందుకు రాలేదు, చిన్న స్టార్లు అడిగితే ప్రభుత్వాలు పట్టించుకోవు. అందువల్ల.. తెలుగు రాష్ట్రాల్లో 100% ఆక్యుపెన్సీ అనేది కష్టమే!