‘అక్టోబర్, నవంబర్ నెలలు టాలీవుడ్ కి కలిసిరావు. ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ప్లాప్ అవుతాయి. జనాలు కూడా థియేటర్లకు రారు’ అనే అభిప్రాయాలు ఇండస్ట్రీ జనాల్లో ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్టోబర్లో ఎక్కువ శాతం పెద్ద సినిమాలు రిలీజ్ కావు. ఈ స్పేస్ ను మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు వదిలేస్తారు పెద్ద సినిమాల ఫిలిం మేకర్స్.
అందుకే అక్టోబర్లో లెక్కలేనన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ బజ్ సంపాదించుకుంది మిడ్ రేంజ్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు మాత్రమే.ఇవన్నీ కలుపుకుని అక్టోబర్లో ఆల్మోస్ట్ 60 వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో 4,5 మినహా బాక్సాఫీస్ వద్ద సందడి చేసినవి ఏమీ లేవు.
అక్టోబర్ 1న ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ రిలీజ్ అయ్యింది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. డిజాస్టర్ గా మిగిలిపోయింది.

అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ రిలీజ్ అయ్యింది. పార్ట్ 1 రేంజ్లో ఈ సినిమా ఆకట్టుకోలేదు. మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ సీక్వెల్ హైప్ కాపాడింది. బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో రూ.18 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది.కానీ ఓవరాల్ గా అయితే బ్రేక్ ఈవెన్ సాధించి డీసెంట్ హిట్ అనిపించుకుంది.

ఇక అక్టోబర్ 10న 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి రక్షిత్ అట్లూరి నటించిన ‘శశివధనే’. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ చూసి ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. టికెట్లు తెగలేదు.

అదే రోజున అనసూయ, సాయి కుమార్ వంటి క్రేజీ ఆర్టిస్టులు నటించిన ‘అరి’ సినిమా రిలీజ్ అయ్యింది. ‘పేపర్ బాయ్’ దర్శకుడు జయశంకర్ తెరకెక్కించిన సినిమా ఇది. కాన్సెప్ట్, క్లైమాక్స్ బాగుంది. మైథాలజీ వాడి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. కానీ సరైన విధంగా సినిమాకి ప్రమోషన్ చేయలేదు. పైగా రిలీజ్ కూడా చాలా సార్లు వాయిదా పడటం వల్ల.. ఆడియన్స్ ఈ సినిమాని పట్టించుకోలేదు.
వరుణ్ సందేశ్ నటించిన ‘కానిస్టేబుల్’ సినిమా కూడా అదే రోజు రిలీజ్ అయ్యింది. సినిమాకి డీసెంట్ టాక్ వచ్చింది. కానీ దీనికి కూడా సరైన ప్రమోషన్స్ జరగలేదు. అందువల్ల ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీదు.
ఇక దీపావళి రేసులో 4 సినిమాలు వచ్చాయి. అక్టోబర్ 16న ముందుగా ‘మిత్రమండలి’ వచ్చింది. బన్నీ వాస్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

ఇక అక్టోబర్ 17న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. కానీ దీనికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ బాగా వచ్చినా తర్వాత టాక్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
అక్టోబర్ 17నే రిలీజ్ అయిన ‘తెలుసు కదా’ … నెగిటివ్ రివ్యూస్ తో చతికిలపడింది. నీరజ కోన డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయింది. తర్వాత సక్సెస్ మీట్ పెట్టి ఓటీటీ కోసం అన్నట్టు ప్రమోషన్ చేసుకున్నారు మేకర్స్.

అక్టోబర్ 18న రిలీజ్ అయిన ‘K-RAMP’ మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ తర్వాత బాక్సాఫీస్ వద్ద బాగానే నిలబడింది. దీపావళి విన్నర్ గా నిలిచింది.
తర్వాత మరో డబ్బింగ్ సినిమా ‘ధామా’ రిలీజ్ అయ్యింది. రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు పరవాలేదనిపించే టాక్ వచ్చింది.కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
ఇక అక్టోబర్ చివర్లో వచ్చిన ‘విద్రోహి’ వంటి సినిమాలు నామ మాత్రంగా వచ్చి వెళ్లాయి.

అక్టోబర్ 31న ‘బాహుబలి ది ఎపిక్’ రీ రిలీజ్ అయ్యింది. మళ్ళీ ఆడియన్స్ థియేటర్ కి వెళ్లి.. ఎంజాయ్ చేస్తున్నారు. రీ- రిలీజ్ సినిమాల్లో ఇది ఆల్ టైం రికార్డులు సృష్టిస్తుంది.

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ కూడా అక్టోబర్ 31న ప్రీమియర్స్ తో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడడం కష్టంగానే కనిపిస్తుంది.
