‘పరాశక్తి'(Parasakthi) విషయంలో ఏర్పడ్డ ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది అనే చెప్పాలి. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఏర్పడ్డ సెన్సార్ చిక్కులు అన్నీ తొలగిపోయాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో రేపు అంటే జనవరి 10న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 1960ల నాటి మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో, హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.
రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కథాంశం కావడంతో సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో కాస్త జాప్యం జరిగింది. మొదట సెన్సార్ బోర్డు దాదాపు 23 కట్స్ చెప్పగా, చిత్ర యూనిట్ రివైజింగ్ కమిటీకి వెళ్లింది. చివరికి పలు మార్పులు, చేర్పుల తర్వాత సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.’డాన్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం.. శివకార్తికేయన్ కెరీర్ 25వ మైలురాయి సినిమా కావడం విశేషం.

శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, జీవీ ప్రకాష్ సంగీతం అందించారు. ఈ సినిమాను డీఎంకేకి చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ దాదాపు 500 స్క్రీన్లలో విడుదల చేస్తోంది.సినిమాలోని కొన్ని సున్నితమైన అంశాలు, అభ్యంతరకర పదాలపై సెన్సార్ బోర్డు సీరియస్ అయింది. కట్ లిస్ట్ ప్రకారం చేసిన ప్రధాన మార్పులివే..
డైలాగ్స్ మ్యూట్: సినిమాలో పలుచోట్ల వచ్చే బూతు పదాలు (బాస్ట*ర్డ్, సిరుక్కి, కుంది, ఒక్కాలి వంటి పదాలను) మ్యూట్ చేశారు.
హిందీ ప్రస్తావన తొలగింపు: ‘హిందీ అరక్కి’ అనే డైలాగ్ వచ్చే ప్రతిచోటా.. ‘హిందీ’ పదాన్ని తీసేసి కేవలం ‘అరక్కి’ అని మాత్రమే ఉంచారు. విజువల్స్, పోస్టర్లలో కూడా ఈ మార్పు చేశారు.
హింసాత్మక సన్నివేశాల తొలగింపు: ఆత్మాహుతి చేసుకునే దృశ్యాలను, అలాగే గ్రామ ఊచకోతకు సంబంధించిన సన్నివేశాల్లో కొన్ని విజువల్స్‌ను (ముఖ్యంగా చనిపోయిన వారి బాడీస్ చూపించడం) 50 శాతం మేర తగ్గించారు.
యాంటీ నేషనల్ డైలాగ్: ‘Anti National scum’ (జాతి వ్యతిరేక ద్రోహి) అనే పదాన్ని డైలాగ్స్‌తో పాటు సబ్-టైటిల్స్ నుండి కూడా పూర్తిగా తొలగించారు.
డిస్క్లైమర్: పోస్టల్ మనీ ఆర్డర్, యూపీఎస్సీ పరీక్షల రద్దు, రైల్వే ఉద్యోగాల్లో భాషా నిబంధనలు వంటి అంశాలు చూపించేటప్పుడు.. ఇది కల్పితం అని చెప్పే ‘డిస్క్లైమర్’ వేయాలని సూచించారు.
పొలిటికల్ సెటైర్స్ ని కూడా: పోస్టాఫీసు బోర్డుపై పేడ కొట్టే విజువల్స్‌ను తొలగించారు. అలాగే కొన్ని రాజకీయ పరమైన డైలాగుల్లో మార్పులు చేశారు.
మొత్తానికి 25 సెన్సార్ కట్స్ తర్వాత 162 నిమిషాల (2 గంటల 42 నిమిషాల) రన్ టైమ్‌తో ‘పరాశక్తి’ రేపు థియేటర్లలోకి రానుంది.
