బొద్దు భామలు సన్నజాజులాయ్యారు

హీరోయిన్‌ అంటే ఉండాల్సిన తొలి లక్షణం అందం. బికినీలో అందాల ఆరబోయలేకపోయినా ఫర్వాలేదు కానీ ఒంపులు తిరిగిన శరీరం ఉండాల్సిందే. లావుగా ఉన్నా అభినయంతో ఆకట్టుకోవడం అప్పటి నాయికలకు చెల్లిందేమో. ఇప్పుడు కష్టమే. లావుగా ఉన్నా అదృష్టం కలిసొచ్చో…వారసత్వంగానో నాయికలు అయిపోయారు చాలామంది భామలు. అగ్రతారలైంది మాత్రం తమ బొద్దు దేహాలన్నీ నాజూకైన శిల్పాలుగా మలుచుకున్నాకే..! కొందరు ముద్దుగుమ్మలు వెండితెరకొచ్చాకా సన్నబడే కార్యక్రమం మొదలుపెడితే కొందరు వెండితెరకు రాకముందే తమను తీర్చిదిద్దుకున్నారు. బొద్దైన ముద్దుగుమ్మ ముద్ర నుంచి ఫిట్‌నెస్‌కే చిరునామాగా మారిన ఆ మెరుపుతీగలివే..!

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా వెండితెరపై అడుగు పెట్టక ముందు 90 కిలోలు బరువు ఉండేదట. వ్యాయామం చేయకపోవడం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తినడంతోనే లావుగా తయారైందట. బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేనాటికి ఆమె 30 కిలోలు తగ్గింది. ‘‘ప్రస్తుతం నేనున్న ఈ రూపు రావడానికి చాలా కష్టపడ్డాను. సరైన ఆహారం తీసుకోవడం… క్రమం తప్పని వ్యాయామంతోనే ఇది సాధ్యమైంద’’ని చెబుతోంది సోనాక్షి.

పరిణితి చోప్రా

సినిమాల్లోకి రాకముందు బొద్దుగా కాదు చాలా లావుగా ఉండేదాన్నని చెబుతోంది పరిణితి చోప్రా. మొదట్లో 86 కిలోలు ఉండేది. నడుము కొలత 38 నుంచి 30కి రావడానికి గట్టిగానే కృషిచేసిందీ భామ. ‘‘చిన్న వయసులోనే బాగా లావుగా ఉన్నాననిపించింది. హీరోయిన్‌గా ఆకట్టుకోవాలంటే మంచి దేహాకృతి కావాలని నిర్ణయించుకొని సన్నబడటంపై దృష్టిపెట్టాను.’’అని చెబుతోంది పరిణితి చోప్రా.

ఆలియా భట్‌

ఇప్పుడు కుర్రకారు మనసు దోచేస్తున్న ఆలియా భట్‌ది ఒకప్పుడు బొద్దు సోయగమే. తొలి చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’లో ముద్దు ముద్దుగానే కనిపించింది. కానీ ఆ తర్వాత తండ్రి మహేష్‌భట్‌ ఆమె డైట్‌పై ప్రత్యేక దృష్టిపెట్టారు. దీంతో ఆలియా 16 కిలోలు తగ్గి మెరుపుతీగలా తయారైంది.

కత్రినా కైఫ్‌

ఎంతోమందికి హాట్‌ ఫేవరెట్‌ భామ కత్రినా కైఫ్‌. ఏళ్ల తరబడి నటిస్తున్న ఆమె అందానికి అభిమానులు చాలామంది ఉన్నారు. తొలి చిత్రం ‘బూమ్‌’లో కత్రినా లావుగా లేదు కానీ, ఆకట్టుకునే కొలతలున్న దేహం కాదు ఆమెది. ఆ సినిమాలో ఆమె కాస్త బొద్దుగా ఉండటం గురించి పలు విమర్శలొచ్చాయి. ఆ విమర్శల్ని సీరియస్‌గా తీసుకొని బికినీలో కూడా అలరించేలా తన దేహాన్ని తీర్చిదిద్దుకొందీ భామ.

సోనమ్‌ కపూర్‌

బాలీవుడ్‌లో ‘మిస్‌ స్టైల్‌ ఐకాన్‌’గా గుర్తింపు తెచ్చుకొన్న సోనమ్‌ కపూర్‌ ఇప్పుడైతే ఇంత నాజూగ్గా ఉంది కానీ, తొలి చిత్రం ‘సావరియా’కు ముందు బొద్దుగానే ఉండేది. అప్పుడు దాదాపు 86 కిలోలు ఉండేది. నానా తంటాలు పడి 30 కిలోలు తగ్గి ‘సావరియా’తో వెండితెరపై తళుక్కుమంది. ఇక ఇప్పుడైతే ఎలాంటి డ్రెస్‌ వేసినా నప్పేలా తయారైంది. తాజా చిత్రం ‘నీర్జా’లో ఎయిర్‌హోస్టెస్‌గా ఎంత చక్కగా ఒదిగిపోయిందో తెరపై అంతే అందంగా కనిపించింది.

కరీనా కపూర్‌

జీరో సైజ్‌ అందం అనగానే గుర్తొచ్చేది కరీనా కపూర్‌. ‘డాన్‌’లోని ‘యే మేరా దిల్‌ ప్యార్‌ కా దివానా..’ పాటలో కాస్త బొద్దుగా ఉందంటూ కరీనాకు విమర్శలు ఎదురయ్యాయి. కానీ ఆ తర్వాత ‘తషాన్‌’లో స్లిమ్‌ బాడీతో బికినీలో కనిపించి వావ్‌ అనిపించింది. బికినీలో జీరోసైజ్‌ అందాలతో అప్పట్లో కరీనా సృష్టించిన సంచలనం మర్చిపోలేం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus