‘విశ్వంభర’ (Vishwambhara) పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ప్రమోషన్స్ కూడా షురూ అయ్యాయి.కొద్దిరోజుల క్రితం ‘రామ.. రామ’ అనే పాట బయటకి వచ్చింది. హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామ రామ’ అంటూ సాగే పాటని వదిలారు.ఈ పాటకి వంక పెట్టడానికి లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. హనుమంతుడు, రాముడు పై సాగే పాట కాబట్టి… ట్రోలర్స్ కూడా భక్తి, భయంతో సైడ్ కి తప్పుకున్నారు. రామజోగయ్య శాస్త్రి (Ramajogayya Sastry) అందించిన లిరిక్స్, కీరవాణి (M. M. Keeravani) సమకూర్చిన ట్యూన్ కూడా బాగానే కుదిరాయి.
అయితే ఈ ఒక్క పాట కోసం నిర్మాతలు ఏకంగా రూ.6 కోట్లు ఖర్చు చేశారట. శోభి మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. 4 భారీ సెట్లు వేయడం… ఈ పాటలో 400 మంది డాన్సర్లు, 15 మంది నటీనటులు, మరో 400 మంది జూనియర్లు పాల్గొనడంతో ఈ పాటకి ఇంత భారీ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని స్పష్టమవుతుంది.అంతేకాకుండా ఈ పాటని దాదాపు 12 రోజుల పాటు చిత్రీకరించారని తెలుస్తుంది.
సినిమాలో ఈ పాట మరింత రిచ్ గా కనిపించే అవకాశాలు ఉన్నాయి అని కూడా స్పష్టమవుతుంది. ఇక ‘విశ్వంభర’ సెకండ్ సింగిల్ కూడా త్వరలోనే రిలీజ్ కానుంది. నెక్స్ట్ మాస్ ఆడియన్స్ ని అలరించే పాటని దింపుతారని వినికిడి. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ఇది. జూలై 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.