ఎం.ఎస్.రాజు… ఒకప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా చలామణి అవుతూ వచ్చిన ఆయన ‘శత్రువు’ ‘దేవి’ ‘మనసంతా నువ్వే’ ‘ఒక్కడు’ ‘వర్షం’ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు. ఆ సినిమాలని కేవలం బ్లాక్ బస్టర్ అని ఒక మాట అనేస్తే మన మనసు సంతృప్తి చెందదు.అవి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ గా కూడా నిలిచిపోయాయి. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రాలు అవి. అలాంటి సినిమాలను నిర్మించిన ఎం.ఎస్.రాజు గారు దర్శకుడిగా కూడా మారి ‘వాన’ ‘డర్టీ హరి’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పుడు ‘7 డేస్ 6 నైట్స్’ అంటూ మరో యూత్ ఫుల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ మూవీ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :
కథ : డైరెక్టర్ కావాలని పరితపించే యువకుడు ఆనంద్ (సుమంత్ అశ్విన్).అంతేకాదు ఇతను లవ్ ఫెయిల్యూర్. ఈ విషయం తెలుసుకున్నప్పుడు సూసైడ్ చేసుకునే రేంజ్ కు వెళ్ళిపోతాడు. ఇక మరోపక్క నటుడు కావాలని కలలు కనే యువకుడు కుమార మంగళం అలియాస్ మంగళం(రోహన్). వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. మంగళంకి పెళ్లి ఫిక్స్ అవుతుంది. వారంలో పెళ్లి అనగా దానిని సెలబ్రేట్ చేసుకునేందుకు తన స్నేహితుడు ఆనంద్ ను తీసుకుని బ్యాచిలర్ పార్టీ నిమిత్తం గోవాకి వెళ్తాడు.
అక్కడ అమియా (కృతికా శెట్టి) అనే అమ్మాయి పై ఆశపడి ఆమెని ప్రేమ పేరుతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మంగళం. మరోపక్క అతని ఫ్రెండ్ రితిక(మెహర్ చాహల్) ఆనంద్ కు మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే మంగళంకి పెళ్లి కుదిరింది అనే విషయం అమియాకి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆమె మంగళం పై ఎలా రియాక్ట్ అయ్యింది? ఆనంద్- రితిక ల ప్రేమ సంగతి ఏమైంది. వీళ్ళ గోల్ సంగతి ఏంటి? అనేది మిగిలిన కథ.
నటీనటుల పనితీరు : ఆనంద్ పాత్రలో సుమంత్ ఆశ్విన్ కేరింత వంటి సినిమాల్లో కనిపించినట్టే కనిపించాడు.ఇది కూడా ఎమోషనల్‌గానే సాగుతుంది తప్ప.. ఆ పాత్రని హైలెట్ గా నిలబెట్టే ప్రయత్నం అయితే సుమంత్ అశ్విన్ ఏమీ చేయలేదు. మంగళం పాత్రలో రోహన్ బాగా నటించాడు. కోపం తెప్పించినా.. చిరాకు తెప్పించినా కానీ ఈ పాత్ర ప్రేక్షకులకి ఎక్కువగా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా యూత్ కు ఈ పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది.
రోహన్ కు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. రితిక అలియాస్ రాట్స్‌గా కనిపించిన మెహర్ చాహల్‌లో లుక్స్ చాలా బాగున్నాయి. ఈమె గ్లామర్ తొందరగా మైండ్లో నుండీ పోదు. కృతికా శెట్టి రొమాంటిక్ సన్నివేశాల విషయంలో రాజీ పడకుండా చేసింది. అంతేకాకుండా కొంతమేర నవ్వించే ప్రయత్నం కూడా చేసింది. ఇక గోపరాజు రమణ వంటి పాత్రలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు ఎం.ఎస్.రాజు ఈ కథని మొదలుపెట్టిన తీరు బాగుంది. కాకపోతే ఆ తర్వాత మాత్రం కథని, కథనాన్ని గాలికి వదిలేసాడు అనిపిస్తుంది. టేకింగ్ పరంగా ఎం.ఎస్.రాజు సినిమాలు మెప్పిస్తూ ఉంటాయి. ఆయన కెరీర్ మొత్తంలో ఇంత నీరసంగా తీర్చిదిద్దిన సినిమా ఇదేనేమో అనే ఫీలింగ్ అడుగడుగునా కలుగుతుంది.
సినిమాలో ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఎక్కడా ఉండదు. ఆనంద్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీని విజువల్‌గా చూపించి ఉంటే జనాలు కనెక్ట్ అయ్యి ఉండేవారేమో.. ఏదో ఆ పాత్ర పై సింపతీ క్రియేట్ చేయడానికి లవ్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ పెట్టినట్టు ఉంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ సో సో గానే ఉన్నాయి . చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ చిత్రాన్ని చుట్టేశారు.
విశ్లేషణ : వాస్తవానికి చెప్పాలి అంటే ఇది ఓటీటీ సినిమా. ఇలాంటి సినిమాలు ఓటీటీలో చూస్తే కొంచెం పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందేమో కానీ బిగ్ స్క్రీన్ పై చూసే విధంగా అయితే లేదు. ‘డర్టీ హరి’ కి లాభాలు వచ్చాయి అంటే అది ఓటీటీకి కరెక్ట్ సినిమా కాబట్టి.. అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఓవరాల్ ‘7 డేస్ 6 నైట్స్’ కి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటి అంటే నిడివి 1 గంట 41 నిమిషాలు మాత్రమే కావడం. చాలా ఓపిక ఉంటే తప్ప.. సింపుల్ గా లైట్ తీసుకోదగ్గ సినిమా ఇది.