నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలయ్య వందో మూవీ టీజర్ దశనుంచే సంచలనం సృష్టిస్తోంది. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 12న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో ఆకర్షించే అంశాలపై ఫోకస్..
ప్రతి సీన్ ఓ ఆణిముత్యం“యుద్ధం నుంచి మీ నాన్న ఎప్పుడొస్తారని ఎదురుచూస్తున్నావా? అని బాల శాతకర్ణిని తల్లి గౌతమి అడుగుతుంది. అప్పుడు ఆ యువరాజు “ప్రజలెందుకు కొట్టుకుంటున్నారమ్మా?” అని ప్రశ్నిస్తాడు.
“ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు” అని బదులిస్తుంది.
“ఇన్ని రాజ్యాలు కాకుండా ఒకే రాజ్యంగా ఉంటే గొడవలు ఉండవు కదా” అనే చెబుతాడు.
“గణ రాజ్యాలను ఒక్కటిగాచేసే వీరుడు పుట్టాలి కదరా” అని అమ్మ చెప్పగానే ..
“నేను పుట్టాను కదా” అని శాతకర్ణి దైర్యంగా చెబుతాడు.
ఈ సన్నివేశం చదువుతుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది కదూ.. ఈ సీన్ తోనే చిత్రం ప్రారంభం అవుతుంది. ఇలాంటి అనేక సన్నివేశాలు ఈ దృశ్యకావ్యంలో ఉన్నాయి.
రియల్ స్టోరీ33 గణ రాజ్యాలుగా ఉన్న భారతాన్ని ఏకంచేసిన యుద్ధ వీరుడు శాతకర్ణి. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో 400 ఏళ్ళ పాటు భారత ఖండాన్ని పాలించిన శాతవాహనుల రాజుల్లో గొప్పవాడు. గ్రీకులు, పర్షియన్లు, ఎదిరించి తెలుగుజాతి ఖ్యాతిని నిలబెట్టిన మహా చక్రవర్తి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కథే ఈ మూవీ.
రియల్ హీరోకొంతమంది నటిస్తారు. మరికొంతమంది జీవిస్తారు. బాలకృష్ణ మాత్రం పాత్రలో లీనమయిపోతారు. తెలుగు భాషను, తెలుగు జాతిని, మీసకట్టును, పంచెకట్టును గౌరవించే అతని చేతికి తెలుగు వీరుడు శాతకర్ణి పాత్ర వస్తే ఆనందంతో ఉప్పొంగిపోయారు. తన తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదంతో కథ తనకి వచ్చిందని భక్తితో, శ్రద్ధతో ఈ మూవీని ఒక యజ్ఞంలా రోజుకు 15 గంటలు శ్రమించి, 79 రోజుల్లో పూర్తి చేశారు. నడకలో, నడతలో, చూపులో, పలుకులో శాతకర్ణిని కళ్లకు కట్టారు.
కబీర్ బేడీనటసింహ బాలయ్యకు ఎదురుగా నిలబడే ప్రతికథానాయకుడు అంత బలంగా ఉండాలి. అందుకే డైరక్టర్ క్రూరుడైన సహపాణుడి పాత్రకు బాలీవుడ్ నటుడు కబీర్ బేడీని తీసుకున్నారు. అతను క్రిష్ నమ్మకాన్ని వమ్ముకానీయకుండా ప్రతి డైలాగ్ ని అర్ధం చేసుకొని విభిన్నంగా పలికి మాటల్లోనే రక్కసి గుణాన్ని చూపించారు. బాలకృష్ణతో పోటీపడి నటించారు.
హేమమాలినిఅలనాటి హీరోయిన్ హేమమాలిని ఈ చిత్రంలో రాజమాత గౌతమి పాత్రను పోషించారు. ఈమె గతంలో పాండవ వనవాసంలో నర్తకి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత శ్రీ కృష్ణ విజయంలోనూ నటించారు. ఈ రెండు మహానటుడు నందమూరి తారకరామారావు చిత్రాలే. అనేక సంవత్సరాల తర్వాత ఆమెను కదిలించిన తెలుగు కథ ఇది. అందుకే నటించడానికి అంగీకరించారు. ఆమె పాత్ర కూడా కథలో కీలకం. తన అనుభవంతో పాత్రకు ప్రాణం పోశారు.
పదబంధ పరమేశ్వరుడుసిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ మూవీలో నాలుగు పాటలను రాశారు. తన పదాలతో యుద్ధ నేపధ్యాన్ని వివరించారు. “గణగణ” మంటూ రౌద్రాన్ని పలికించారు. తన సాహిత్యం ద్వారా కథను చెప్పే ప్రయత్నం చేశారు. సీతారామ శాస్త్రి కలానికి క్రిష్ సృజన ఎలా ఉండబోతుందోనని అందరూ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
నాలుగు యుద్ధ సన్నివేశాలు132 నిముషాల నిడివిగల ఈ సినిమాలో నాలుగు భారీ యుద్ధ సన్నివేశాలున్నాయి. వీటిని మొరాకో, జార్జియాలోని మౌంట్ కాజ్బెక్, మధ్య ప్రదేశ్, రష్యన్ బార్డర్ లో చిత్రీకరించారు. 1000 సైనికులు 300 గుర్రాలు ఈ వార్ ల్లో పాల్గొన్నాయి. ఆ యుద్దాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు.
క్రిష్చివరికి చెప్పినా, మొదట చెప్పినా గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో ముడిపడిన పేరు క్రిష్. అతనే ఈ చిత్రాన్ని కలగన్నాడు. కల కనడంతోనే ఆగిపోకుండా శోధించి, మధించి కథను సిద్ధం చేసి వెండితెరపై ఆవిష్కరించారు. ‘గమ్యం’ నుంచి ‘కంచె’ వరకూ క్రిష్ సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. వాటిలోని పాత్రలు కళ్ళల్లో కదలాడుతున్నాయి. అటువంటి దర్శకుడి మెగా ఫోన్ నుంచి వచ్చిన ఈ చిత్రం తెలుగు జాతి ప్రజల మనో పలకం పై ముద్రవేసుకోవడం ఖాయం.
శ్రియ శరన్ నటన, చిరంతన్ బట్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా మాటలు, వీ.ఎస్.ఘన శేఖర్ కెమెరా పనితనం … ఇలా ఒకటా, రెండా.. ఎన్నో విశేషాలను గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ తనలో నింపుకుంది. చరిత్రను లిఖించడానికి వస్తోంది. ఆదరిద్దాం.. ఆస్వాదిద్దాం.. ఆశీర్వదిద్దాం.. సాహో శాతకర్ణి.