తెలుగు టీవీ చరిత్రలో ఎక్కువ కాలంపాటు నిలిచే సీరియళ్లు చాలానే ఉన్నాయి. అయితే కామెడీ షోలు మాత్రం రెండే ఉన్నాయి. ఒకటి ‘జబర్దస్త్’ కాగా, రెండోది ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’. మామూలుగా అయితే ఈ రెండూ ఒకటే. అయితే రెండింటి ప్రారంభం మధ్య కొన్నాళ్ల గ్యాప్ ఉంది. ‘జబర్దస్త్’ హిట్ అయిన కొన్ని రోజులకు ఈ నవ్వులకు ఎక్స్‌ట్రా అందిస్తాం అంటూ ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ వచ్చింది. అయితే ఇప్పుడు ఒకటి కాబోతున్నాయి.
అవును మీరు చదివింది నిజం. రెండుగా ‘జబర్దస్త్’ షోను మార్చేసి ఒకటి చేసేస్తున్నారు. వచ్చే వారం నుండే ఈ మార్పును చూడొచ్చు. అంతేకాదు ఆ షో టైమింగ్స్ కూడా మార్చేశారు. గురువారం, శుక్రవారం ఇప్పటివరకు ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాల్ని ఇకపై ఒకటి చేసి శుక్రవారం, శనివారం ప్రసారం చేస్తారట. అంటే శనివారం వస్తున్న ‘సుమ అడ్డా’ దాదాపుగా గురువారం రావొచ్చు అని అంటున్నారు. పదేళ్లకుపైగా అదే రోజుల్లో, ఇదే ఫార్మాట్‌లో ప్రసారమైన ‘జబర్దస్త్’ షోలు ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు అనే విషయంలో క్లారిటీ అయితే ఇవ్వలేదు.
రామ్ ప్రసాద్ వేసిన స్కిట్‌లో భాగంగా ఈ మార్పు గురించి చెప్పారు. అయితే ఎక్కడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. రామ్ ప్రసాద్ చెబుతున్నప్పుడు యాంకర్ రష్మి (Rashmi Gautam).. జడ్జిలు కృష్ణ భగవాన్ (Krishna Bhagavaan) , ఖుష్బూ (Khushbu Sundar) భావోద్వేగానికి గురవ్వడం ఆ ప్రోమోలో చూడొచ్చు. అయితే ‘జబర్దస్త్’ ఇకపై రెండుగా కాకుండా.. రెండు భాగాలుగా ప్రసారమవుతుందట. ఒక్కో షోలో ఐదు టీమ్‌లు పెట్టి నడపడం వీలుపడటం లేదనే కారణంతో ఒకటి చేసి 8 టీమ్‌లు పెట్టారు అని కూడా అంటున్నారు.
ఇక జడ్జిల విషయంలోనూ మార్పులు ఇప్పటికే వచ్చాయి. షో నుండి కొన్నాళ్లు గ్యాప్ తీసుకుంటున్నాను అని ఇంద్రజ (Indraja) ఇప్పటికే చెప్పారు. కాబట్టి ఖుష్బూ కంటిన్యూ అవుతారు. ఇక కృష్ణ భగవాన్ ఎలాగూ ఉంటారు. యాంకర్ల విషయంలో చూస్తే.. రష్మి కొనసాగుతుంది. సిరి బయటకు వచ్చేసింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు ఎందుకు ఇన్ని మార్పులు చేశారు అనేదే అర్థం కావడం లేదు.